గోదావరిఖని(రామగుండం): సంస్థ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, స్కాం పేరుతో మరింత నష్టపరుస్తున్నారని.. దీంతో సింగరేణి భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని.. ఏది ఏమైనా అంతిమంగా నష్టపోయేది కార్మికులేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం ఎన్టీపీసీలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో జరిగిన సింగరేణి పరిరక్షణ సదస్సులో మాట్లాడారు. మంత్రి శ్రీధర్‌బాబు మేనిఫెస్టో సభ్యుడిగా ఉండి తయారు చేసిన సింగరేణి హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తాము అధికారంలో ఉండగా పదేళ్లలో రూ.7,350కోట్లు అప్పు ఉంటే ప్రస్తుతం రెండేళ్లలో రూ.12,377కోట్లు అప్పుచేశారన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, సింగరేణిలో పొగొట్టిన డిపెండెంట్‌ను తిరిగి కేసీఆర్ ప్రభుత్వం సాధించిందన్నారు. గైర్హాజర్ పేరుతో కార్మికులను తొలగించే కుట్ర చేస్తున్నారని, సంస్థ ప్రమాదంలో ఉందన్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో సింగరేణి తీరుపై ప్రశ్నిస్తామని పేర్కొన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రజలు బీఆర్‌ఎస్ ప్రభుత్వం కోసం వేచి చూస్తున్నారని పేర్కొన్నారు. సింగరేణిని కాంగ్రెస్ దోచుకుంటుందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆరోపించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి సింగరేణిని కాపాడుకునేందుకు సమష్టిగా ఉద్యమించే సమయం ఆసన్నమైందని పుట్ట మధు అన్నారు. అప్పులు తెచ్చి కార్మికులకు జీతాలకు చెల్లించే పరిస్థితిలో సింగరేణి నెట్టివేయబడిందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. సదస్సులో టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి, నాయకులు మాదాసి రామ్మూర్తి, వ్యాళ్ల హరీశ్‌రెడ్డి, మూల విజయారెడ్డి, జక్కు శ్రీహర్షిణి, నూనె కొమురయ్య, నడిపెల్లి మురళీధర్‌రావు, కౌశికహరి పాల్గొన్నారు.
రేవంత్‌రెడ్డికి హిట్లర్ గతే పడుతుంది
పెద్దపల్లి: రానున్న రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డికి హిట్లర్‌కు పట్టిన గతే పడుతుందని హరీశ్‌రావు అన్నారు. ఆదివారం పెద్దపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి దేవుళ్లని, బీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాగా, మాజీ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి నుంచి రూ.23 లక్షలు ఇప్పించాలని బీఆర్‌ఎస్ నాయకుడు తాళ్లపల్లి మనోజ్‌గౌడ్ సమావేశం ప్రారంభంలో మాజీ మంత్రి హరీశ్‌రావును వేడుకున్నారు. ఈక్రమంలో నాయకులు, మనోజ్ మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు అతడిని అక్కడి నుంచి తీసుకెళ్లారు.


