పీఎంజే దోపిడీ కేసులో మలుపు వెలిచాల శివారులో తుపాకులు, బుగ్గారం పరిధిలో సెల్‌ఫోన్ స్వాధీనం బిహార్‌లో మరొకరి అరెస్ట్.. కీలక వివరాలు దాస్తున్న నిందితులు మళ్లీ కస్టడీ కోరుతూ కోర్టును ఆశ్రయించనున్న పోలీసులు
కరీంనగర్‌క్రైం: పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రధాన నిందితుడు సుభోద్‌సింగ్, రఘునాథ్ కర్మాకర్, రవీష్‌కుమార్‌ను నాలుగు రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకోగా.. బంగారం ఆచూకీ మిస్టరీగానే మిగిలింది. ఇదే సమయంలో పరా రీలో ఉన్న మరో నిందితుడిని బిహా ర్‌లో అరెస్టు చేయ డం కేసు దర్యాప్తునకు బలం చేకూర్చింది. కరీంనగర్ పోలీ సు కమిషనరేట్‌లో ఆదివారం సీపీ గౌస్ ఆలం కేసు దర్యాప్తు, పురోగతి అంశాలను వివరించారు.
బంగారం ఆచూకీపై గందరగోళం
దోపిడీకి గురైన సొత్తు ఆచూకీ విషయంలో నిందితులు సహకరించడం లేదని సీపీ స్పష్టం చేశారు ఆభరణాలు ఎక్కడ దాచారు..? ఎవరికి విక్రయించారు..? ఎవరి ద్వారా తరలించారు..? ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి..? వంటి అంశాలను నిందితులు వివరించడం లేదని అన్నారు. విచారణలో పరస్పర విరుద్ధమైన వాంగ్మూలాలు ఇవ్వడంతో పాటు పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
మాట మార్చిన రఘునాథ్ కర్మాకర్
కేసు దర్యాప్తులో రఘునాథ్ కర్మాకర్ వ్యవహారం అనుమానాస్పదంగా మారింది. గతంలో గుండాల అటవీ ప్రాంతంలో దోపిడీ సొత్తును దాచిపెట్టినట్లు తెలిపిన నిందితుడు, ప్రస్తుతం ఆ సమాచారం సరైంది కాదని చెబుతున్నాడు. దీంతో నిందితులు ఉద్దేశపూర్వకంగానే నిజాన్ని దాచిపెడుతున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మళ్లీ కస్టడీ కోరనున్న పోలీసులు
నిందితుల నాలుగు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. దర్యాప్తునకు అవసరమైన పూర్తి సమాచారం లభించకపోవడంతో మరికొన్ని రోజులు కస్టడీకి కోరుతూ కోర్టును ఆశ్రయించనున్నట్లు సీపీ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో కీలక నిందితుడు అమర్‌సింగ్ అలియాస్ పహిల్వాన్ అలియాస్ ఆమరేంద్ర సింగ్‌ను బిహార్‌లోని సలింపూర్ ప్రాంతంలో జూన్ 4న అరెస్టు చేశామని సీపీ వెల్లడించారు. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఆదివారం కరీంనగర్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం.
వెలిచాల వద్ద తుపాకులు స్వాధీనం
నిందితులు వెలిచాల బైపాస్ రోడ్డుకు సమీపంలో చెట్ల పొదల్లో రెండు తుపాకులు దాచినట్లు అంగీకరించారని, వాటిని స్వాధీనం చేసుకున్నామని సీపీ వెల్లడించారు. దోపిడీ అనంతరం ధర్మపురి వైపు వెళ్లి బుగ్గారం అటవీ ప్రాంతంలో మొబైల్ పడేసినట్లు చెప్పడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ వస్తువులు కేసు దర్యాప్తులో కీలక ఆధారాలుగా మారనున్నాయని, ఫోన్‌లోని కాల్ డేటా, లొకేషన్, ఇతర డిజిటల్ ఆధారాలు నిందితుల నెట్‌వర్క్‌ను బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


