పెద్దపల్లిరూరల్: బస్సుల కోసం వేచిచూసేందుకు ప్రయాణికులకు బస్‌షెల్టర్లు కరువయ్యాయి. పెద్దపల్లి నుంచి ధర్మారం వెళ్లే వారంతా ఇలా దుకాణాల ఎదుట నిరీక్షించాల్సి రావడంతో ఆయా దుకాణాల యజమానుల నుంచి చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎండలు మండిపోతుండడంతో ఇలా నీడకోసం దుకాణాల ఎదుట నిరీక్షించక తప్పని పరిస్థితి నెలకొందని వారు వాపోతున్నారు. అధికారులు కనీసం చలువపందిర్లు వేసినా బాగుండేదని అంటున్నారు.
సహజ కవయిత్రికి సత్కారం
పెద్దపల్లిరూరల్: పట్టణానికి చెందిన సహజ కవయిత్రి బొమ్మిదేని రాజేశ్వరిని ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆవరణలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో అంతర్జాతీయ సాహిత్యసంస్థ శ్రీశ్రీకళావేదిక ప్రతినిధులు సత్కరించారు. 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల సందర్భంగా రాజేశ్వరి ఆలపించిన ‘ప్రకృతి పరిరక్షణకు ప్రతినబూనుదాం’.. ప్లాస్టిక్ మయం మన ప్రాణాలకు భయం.., విషపూరిత వాయువులు జీవితానికి శత్రు సాయుధులు’.. ఇలా సాగిన రాజేశ్వరి కవితాగానం పలువురి మన్ననలు పొందింది. గ్లోబల్ యూనివర్సిటీ అధినేత కేవీవీ సత్యనారాయణరాజు, కళావేదిక సీఈవో కళారత్న కత్తిమండ ప్రతాప్ తదితరులు సత్కరించారు.
రేపు శ్రీసీతారామాలయ భూమి కౌలు వేలం
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబరు 934లోని 11.24ఎకరాల భూమికి ఈనెల 9న కౌలు వేలం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ముద్దసాని శంకరయ్య తెలిపారు. ఆలయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి గల వారు రూ.50వేల ధరావత్ చెల్లించి పాల్గొనాలని సూచించారు.


