మారని చేతిరాత | - | Sakshi
Sakshi News home page

మారని చేతిరాత

Feb 26 2026 7:24 AM | Updated on Feb 26 2026 7:24 AM

మారని

మారని చేతిరాత

వివాదాస్పదంగా ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యుల తీరు

గిగబిజి అక్షరాలతో అర్థంకాని ప్రిస్క్రిప్షన్‌

పెద్ద అక్షరాలతో రాయాలనే ఆదేశాలు బేఖాతరు

మందులు ఎలా వాడాలో స్పష్టం చేయని వైనం

మెడికల్‌షాప్‌ నిర్వాహకుల సలహాలే దిక్కు

పాలకుర్తికి చెందిన ఓ రైతు కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతూ రామగుండంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిని ఆశ్రయించాడు. పరీక్షించిన వైద్యుడు సుమారు రూ.4వేల విలువైన మందులు రాసి నెలరోజులపాటు వాడి మళ్లీ రావాలని సూచించారు. పేషెంట్‌ వద్ద కొంతడబ్బే ఉండడంతో పదిరోజులకు సరిపడా మందులను అదే ఆస్పత్రిలోని మెడికల్‌షాప్‌లో కొనుగోలు చేశాడు. అవి అయిపోగానే పాలకుర్తి సమీపంలోని పలు మెడికల్‌షాపుల్లో అడిగినా ఆ మందులు దొరకలేదు. విధిలేక రామగుండంలోని అదే ఆస్పత్రి మెడికల్‌ షాప్‌లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. ప్రతీనెల అంతపెద్దమొత్తంలో వెచ్చించే స్థోమతలేక జనరిక్‌ షాపుల్లో అడిగితే.. బ్రాండెడ్‌ పేర్లు ఉండడంతో అక్కడా కొనుగోలు చేయలేని దుస్థితి ఏర్పడింది.

సాక్షి, పెద్దపల్లి: వైద్య పరీక్షల తర్వాత ప్రిస్క్రిప్షన్‌ చీటీపై ఆంగ్లభాషలో డాక్టర్లు పెద్దక్షరాల్లో మందుల పేర్లు రాయాలి. మెడికల్‌ షాపులోని ఫార్మసిస్ట్‌తోపాటు పేషెంట్‌కూ మందు ఏమిటనేది అర్థమయ్యేలా ఉండాలి. దీనిపై జాతీయ ఆరోగ్య పరిరక్షణ మంత్రిత్వశాఖ గతంలోనే ఆదేశాలు జారీచేసింది. కానీ, ఆ డాక్టర్‌తోపాటు మెడికల్‌షాప్‌ నిర్వాహకులకు మినహా మరెవరికీ అర్థంకాని రీతిలోప్రిస్క్రిప్షన్‌లు ఉంటున్నాయి. మెడికల్‌ షాపుల్లో తప్పనిసరి ఫార్మసిస్ట్‌ ఉండాలి. కానీ జిల్లాలోని చాలాదుకాణాలు ఒకరి పేరిట ఉంటే.. మందుల విక్రయాలు మరొకరు చేస్తున్నారు. కొన్నిసందర్భాల్లో అక్షరాలు అర్థంకాక ఒకదానికి బదులు మరో మందు ఇస్తున్నారు. మరికొందరు అధిక కమీషన్‌ వచ్చే ఔషధాలనే అంటగడుతున్నారు. ఎవరైనా తెలిసి అడిగితే.. అదే కాంబినేషన్‌ అంటూ బుకాయిస్తున్నారు.

జనరిక్‌కు ప్రోత్సాహం కరువు

ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యుల్లో చాలామంది సొంతబ్రాండ్లకు తప్ప జనరిక్‌ మందులను ప్రోత్సహించేలా రాయడం లేదు. ఖరీదైన బహుమతులు, విహార యాత్రల వంటి ఆఫర్లు ఇచ్చే కంపెనీల బ్రాండెడ్‌ మందులను మరికొందరు రాస్తున్నారు. వీరురాసే మందులు వారి మెడికల్‌ షాపుల్లోనే లభిస్తాయి. వాటికోసం ఎంతదూరంలో ఉన్నా పేషెంట్‌ అక్కడకు వెళ్లాల్సిందే.

అమలుకాని ఉత్తర్వులు

మందుల చీటీపై స్పష్టమైన రాత అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21కి లోబడి ఆరోగ్యహక్కు కింద కు వస్తుందని కోర్టులు స్పష్టం చేశాయి. ఎన్‌ఎంసీ, ఎంసీఐలు వైద్యుల చేతిరాత గురించి పదేపదే హెచ్చరించినా మార్పేమీ రావడం లేదు. చీటీపై జనరిక్‌ పేర్లతోనే మందులు రాయాలని తెలంగాణ వైద్యమండలి(టీఎస్‌ఎంసీ) ఆరేళ్ల కిత్రం ఆదేశాలు జారీచేసింది. బ్రాండ్ల పేర్లతో రాయకూడదని, జనరిక్‌ పేర్లతోనే.. అదికూడా పెద్దక్షరాలతోనే ఉండాల ని సూచించింది. ఇవి ఎక్కడా అమలుకు నోచుకోవడంలేదు. ఉదాహరణకు.. జ్వరం వస్తే ‘పారాసిట్‌మల్‌’ అని మాత్రమే రాయాలి. కొందరు తమ ఆస్పత్రుల్లోనే ఉండే బ్రాండ్‌ పేరు రాస్తున్నారు.

పెద్ద అక్షరాలతోనే రాయాలి

జాతీయ వైద్య విధాన సంస్థ పెద్దక్షరాల్లోనే మందుల పేర్లు రాయాలని సూచించింది. మందుల పేర్లు అందరికీ స్పష్టంగా అర్థమయ్యేలా వైద్యులు రాయాలి. ప్రిస్క్రిప్షన్‌పై జనరిక్‌ మందుల పేరే రాయాలి.

– శ్రవణ్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌

స్పష్టత ఉండాలి

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ వైద్యులు.. ప్రిస్క్రిప్షన్‌పై వైద్యులు రాసే మందుల పేర్లు పెద్ద క్షరాలతో, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు స్పష్టంగా అర్థమయ్యేలా రాసేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీధర్‌, డీసీహెచ్‌వో, పెద్దపల్లి

మారని చేతిరాత1
1/1

మారని చేతిరాత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement