అభ్యసన సామర్థ్యం పెంచేలా..
మంథనిరూరల్: ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించాయి. ఇందుకోసం జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రెండోతరగతిపై దృష్టి సారించాయి. ఐదేళ్లుగా విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యం పెంపొందించే దిశగా అడుగులు వేస్తున్న సర్కార్.. ఈ విద్యాసంవత్సరంలోనూ దానిని కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఆయా పాఠశాలల్లో ఎఫ్‌ఎల్‌ఎన్ సర్వేకు శ్రీకారం చుట్టింది. ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేకంగా నియమించిన ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు సర్వే చేస్తారు.
53 పాఠశాలల్లో సర్వే..
జిల్లాలోని 13 మండలాల్లో 360 ప్రైమరీ, 85 యూపీఎస్‌లు ఉండగా 53 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను సర్వే కోసం ఎంపిక చేశారు. ఇందులో 295 మంది విద్యార్ధులు రెండోతరగతి చదువుతున్నారు. వారిలో అభ్యసన సామ ర్థ్యం అంచనా వేసేందుకు 53 మంది డైట్ కళాశాల విద్యార్థులను ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా నియమించారు. ఇప్పటికే సర్వేపై రెండురోజుల పాటు వారికి శిక్షణ ఇప్పించినట్లు అధికారులు తెలిపారు.
మూడురోజుల పాటు..
అభ్యసన సామర్థ్యం అంచనా వేసేందుకు నియమించిన ఫీల్డ్ ఇన్వేస్టిగేటర్లు మూడురోజులపాటు ఎంపిక చేసిన ప్రతీపాఠశాలను సందర్శిస్తారు. వి ద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్, గణితం స బ్జెక్టులపై పరీక్షలు నిర్వహించి అభ్యసన సామర్థ్యాలు అంచనా వేస్తారు. తొలిరో జు తెలుగు, రెండోరోజు గణితం, మూడోరోజు ఇంగ్లిష్ పాఠ్యాంశాలపై సర్వే చేయనున్నారు.
ఒక్కోసబ్జెక్టుకు ఒక్కోరీతిలో..
రెండోతరగతి విద్యార్థి ఒక్కో సబ్జెక్టులో ఎంతమేర అభ్యసన సామర్థ్యం కలిగి ఉన్నాడనే అంశాన్ని అంచనా వేయనున్నారు. తెలుగులో ధారాళంగా మాట్లాడడం, తప్పులు లేకుండా రాయడం, గణితంలో రెండోతరగతి స్థాయిలో ఒక అంకె పదాలు, రెండు అంకెల పదాలను గుర్తించడం, తీసివేత, కూడిక, గుణించడం లాంటి అంశాలు, ఇంగ్లిష్‌లో ఒక నిమిషానికి ఎన్నిపదాలు మాట్లాడగలడనే విషయాలను విద్యార్థుల ద్వారా తెలుసుకుంటారు. మూడు సబ్జెక్టుల్లో కనీస పరిజ్ఞానం ఉందా? లేదా? అనే విషయాన్ని అంచనా వేయనున్నారు.
ప్రాథమిక విద్యార్థులపై సర్కారు ఫోకస్
నేటినుంచి ఎఫ్‌ఎల్‌ఎన్ సర్వేకు ఏర్పాట్లు
ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లతో సామర్థ్యం అంచనా
మంచి ఫలితాల సాధన కు జిల్లా విద్యాశాఖ కసరత్తు


