గాడితప్పిన పారిశుధ్యం
నిలిచిన అభివృద్ధి..
కోల్‌సిటీ(రామగుండం): అర్ధంతరంగా నిలిచిన అభివృద్ధి పనులు.. గాడితప్పిన పారిశుధ్యం నిర్వహణ.. ఆస్తిపన్ను సవరణపై నిర్లక్ష్యం.. అధికారుల్లో కొరవడిన జవాబుదారీతనం.. సుమారు ఏడాదికిపైగా పాలకవర్గం లేకపోవడం.. వెరసి రామగుండం నగర కొత్త పాలకవర్గానికి స్వాగతం పలుకుతున్నాయి. తాము ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు కొత్త పాలకవర్గం పరిష్కారం చూపుతుందనే గంపెడాశతో ఎదురుచూస్తున్న నగరవాసులకు.. ఇటీవల మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన మహంకాళి స్వా మి గురువారం బాధ్యతలు స్వీకరించనుండం ఊరటనిస్తుందని వారు భావిస్తున్నారు.
ఆస్తిపన్ను ఆధారం..
బల్దియా ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను. వందశాతం వసూలైతేనే నగర పాలక సంస్థ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అనుమతి లేకుండా వెలుస్తున్న పెంట్ హౌస్‌లకు ఆస్తిపన్ను విధించడంలేదు. రేకుల షెడ్లు డాబా ఇళ్లుగా మారుతున్నా ఆస్తిపన్ను సవరించడంలేదు. నగరంలోని 60 డివిజన్లకు కేటాయించిన వార్డు అధికారులపై పర్యవేక్షణ కొరవడింది. వారి పనితీరుపై అనేక ఆరోపణలు వస్తున్నాయి.
సమయపాలనలేని తాగునీటి సరఫరా
రామగుండం నగరంలో సమయపాలన లేకుండా తాగునీరు సరఫరా చేయడం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. కుళాయి కనెక్షన్ ఉన్న ప్రతీఇంటికి నీటిని వృథా చేయకుండా అడ్డుకట్ట వేసే పరికరాలు, మీటర్లు కూడా లేవు.
సదుపాయల్లేని ‘స్వచ్ఛ నగరం’
‘స్వచ్ఛ నగరం’ లక్ష్యంగా ప్రకటించినా సదుపాయాల కల్పనలో అలసత్వం ఎందుకని నగరవాసులు ప్రశ్నిస్తున్నారు. జనసాంద్రత పెరుగుతున్నా.. మహిళలు, పురుషుల కోసం సరిపడా పబ్లిక్ టాయిలెట్లు, యూరినల్ సౌకర్యాలు అందుబాటులో లేక తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ము ఖ్యంగా మహిళల పరిస్థితి అధ్వానంగా మారింది.
రామగుండం నగరంలో అనేక సమస్యలు
ముప్పుతిప్పలు పడుతున్న బల్దియావాసులు
నేడు బాధ్యతలు స్వీకరించనున్న మేయర్
మహంకాళి స్వామిపైనే నగర ప్రజల ఆశలు
గాడితప్పిన శానిటేషన్
నగరంలో పారిశుధ్య నిర్వహణ గాడితప్పింది. శానిటేషన్ అధికారులు, సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు ఫొటోలకు ఫోజులిచ్చి పనులు పూర్తిచేసినట్లు అధికారుల వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంటింటికీ చెత్త సేకరణ సమగ్రంగా అమలు కావడం లేదు. ఫిర్యాదు చేస్తే యజమాలను బెదిరించి చెత్త సేకరించడం లేదనే విమర్శలు వెత్తుతున్నాయి. రూ.కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన ఆధునిక పారిశుధ్య వాహనాలు మూలన పడుతున్నా పట్టించుకునే దిక్కులేదు. వినియోగానికి ముందే తుప్పుపడుతున్నా బల్దియా నిర్లక్ష్యం వీడడంలేదు. ర్యాగ్‌పిక్కర్లపై సూపర్‌వైజర్ల పర్యవేక్షణ లేదు. గత్యంతరం లేక చాలా డివిజన్లలోని ప్రజలు సమీప డ్రైనేజీలు, కుటుంబాలు రహదారులపైనే పడేస్తున్నారు. కొన్నిచోట్ల చెత్త గుట్టలుగా కనిపించడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది.
గాడితప్పిన పారిశుధ్యం


