నామినేషన్ల జోరు
● రెండోరోజూ కొనసాగిన అభ్యర్థుల రద్దీ
● నేటితో ముగియనున్న గడువు
కోల్‌సిటీ(రామగుండం): జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి జోరందుకుంది. మొత్తం 124 వార్డులు/డివిజన్లకు తొలిరోజు 102 నామినేషన్లు దాఖలుకాగా రెండోరోజూ గురువారం 338 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు, పార్టీ నేతలు, ఆశావహులు, మద్దతుదారులతో నామినేషన్ స్వీకరణ కేంద్రాలు కిటకిటలాడాయి. శుక్రవారం నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనుంది.
పార్టీల మధ్య పోటీ
వివిధ రాజకీయ పార్టీల మధ్య పోటీతీవ్రంగా ఉంది. ఒక్కోవార్డుకు ఒకటికిమించి నామినేషన్లు దాఖలవుతున్నాయి. అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్షాలు, చిన్నపార్టీలు, స్వతంత్రులు పెద్ద సంఖ్యలో బరిలో దిగుతున్నారు. ఉదయం నుంచే నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు మద్దతుదారులతో సందడి చేశారు. మధ్యాహ్నానికి రద్దీ పెరిగింది. కొందరు అనుచరులతో కలిసి ర్యాలీలతో రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామగుండం కార్పొరేషన్‌లోని 46వ డివిజన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మహంకాళి స్వామి గురువారం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
పోలీసుల ప్రత్యేక బందోబస్తు
జిల్లాలోని రామగుండం కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాల్టీల్లోని నామినేషన్ కేంద్రాల వద్ద భద్రతా పోలీసులు భారీబందోబస్తు ఏర్పాటు చేశారు.
సజావుగా నామినేషన్ల స్వీకరణ
రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణను సజావుగా చేపట్టారు. అభ్యర్థులకు మార్గదర్శకాలు అందిస్తున్నారు. పత్రాలు సక్రమంగా ఉన్నాయా, అవసరమైన ధ్రువపత్రాలు జతచేశారా? అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతో గడువు ముగియనున్న నేపథ్యంలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆశావహులు కొందరు నో డ్యూ సర్టిఫికెట్ కోసం బల్దియా కార్యాలయాల చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నారు. శుక్రవారం గడువు ముగిసే వరకు నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. దీంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.
రెండోరోజు నామినేషన్లు
రామగుండం 168
పెద్దపల్లి 77
మంథని 56
సుల్తానాబాద్ 37


