
యూరియా కష్టాలకు ‘చెక్’ పోస్టులు
సుల్తానాబాద్: రైతులకు అవసరమున్న మేరకు యూరియా సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షించి యూరి యా సరిహద్దులు దాటిపోకుండా చూడాలని ఆదేశించారు. ఈ మేరకు మంథని ప్రాంతంలోని సుందిళ్ల, అడవి సోమనపల్లిలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే వ్యవసాయ, పోలీస్, సివిల్‌సప్లై అధికారులతో టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం యూరియా నిల్వలు జిల్లా సరిహద్దులు దాటిపోకుండా పర్యవేక్షిస్తోంది. యూరియా అక్రమ రవాణాకు కళ్లెం వేస్తోంది.
28వేల మెట్రిక్ టన్నులు అవసరం
జిల్లావ్యాప్తంగా 20 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలతో పాటు ప్రైవేట్ వ్యాపారులు యూరి యాను విక్రయిస్తున్నారు. జిల్లాలోని రైతుల సాగు కు దశలవారీగా 28వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వానాకాలం సాగు ప్రారంభంలో జిల్లాలో 9,030 మెట్రిక్ టన్ను ల నిల్వలు ఉండగా.. 12,551 మెట్రిక్ టన్నులను కొత్తగా దిగుమతి చేసుకున్నారు. రైతులకు ఇప్పటివరకు 18,991 మెట్రిక్ టన్నులు అందించగా.. ఇంకా 2,590 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉన్నా యి. మరో 3,829 మెట్రిక్ టన్నులు అవసరం కాగా గుజరాత్ నుంచి 6,419 మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్నట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు.
టాస్క్‌ఫోర్స్ కమిటీ పర్యవేక్షణ
జిల్లాలో యూరియా పక్కదారి పట్టకుండా కలెక్టర్ టాస్క్‌ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ బృందంలో వ్యవసాయ అధికారులతో పాటు సివిల్ సప్లై, పోలీస్ అధికారులు ఉన్నారు. యూరియా జిల్లా సరిహద్దులు దాటిపోకుండా ఈ కమిటీ పర్యవేక్షిస్తోంది. చెక్‌పోస్టుల్లో 24గంటల పాటు అందుబాటులో ఉంటూ.. ప్రతీ వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. సాగుకు అనుగుణంగా జిల్లాలో యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఫర్టిలైజర్ తనిఖీలు నిర్వహించి, రిజిస్టర్లను పరిశీలించారు. నిల్వల్లో, విక్రయాల్లో తేడా లేకపోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
మంథని పరిధిలోని సుందిళ్ల, అడవి సోమనపల్లిలో ఏర్పాటు
టాస్క్‌ఫోర్స్ బృందంతో నిత్యం పర్యవేక్షణ