రామగుండం.. ఎమ్మెల్యే టికెట్‌ నాదే..

- - Sakshi

సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాలో అధికార, విపక్ష పార్టీల నేతలు జనం బాట పట్టారు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ గడప గడపకూ పార్టీ అంటూ వివిధ పేర్లతో చేపడుతున్న కార్యక్రమాలతో జిల్లాలో రాజకీయం వేడెక్కిస్తున్నారు. అయితే రామగుండం నియోజకవర్గంలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు.. అధికార పార్టీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడికే పోటాపోటీగా ఎమ్మెల్యే ఆశావహులు రహస్య సమావేశం నిర్వహించి పాదయాత్రలు చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో పాటు, కార్పొరేటర్లు, కార్మిక నాయకులు అభ్యర్థులుగా తమకు తాము ప్రకటించుకొని టికెట్‌ దక్కించుకునేందుకు ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. 

జిల్లా అధ్యక్షుడికే తప్పని ‘ఇంటి పోరు’
బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులను ఒక్కతాటి పైకి తీసుకవచ్చి, పార్టీని బలోపేతం చేయాల్సిన కోరుకంటి చందర్‌పై ఇంటిపోరును సరిదిద్దలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు, కార్యకలాపాలు చేయని ఆశావహులు, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేరుగా పాదయాత్రల పేరుతో రంగంలోకి దిగుతుండటంతో రామగుండంలో రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్‌లకే టికెట్లు అని సీఎం కేసీఆర్‌ ప్రకటించటంతో ఈసారి తనకే టికెట్‌ వస్తుందని ఎమ్మెల్యే చందర్‌

 ‘ప్రజాచైతన్య యాత్ర ‘పేరుతో గడప గడపకూ పార్టీ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేలా పర్యటిస్తున్నారు.కాగా బీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యే కోరుకంటికి వ్యతిరేకంగా రహస్యంగా పలు దఫాలుగా సమావేశమై, కోరుకంటికి తప్ప ఎవరికి టికెట్‌ ఇచ్చినా గెలిపించుకుంటామని  ప్రకటనలు చేశారు. తాజాగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేకు పోటాపోటీగా శనివారం నుంచి పాదయాత్రలు మొదలు పెట్టి కేసీఆర్‌ను సీఎంగా గెలిపించుకుంటామనడం, ప్రస్తుత ఎమ్మెల్యే గెలుపుకోసం పాటుపడుతామని ప్రకటించకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఎమ్మెల్యే కోరుకంటి మాత్రం ఈ పరిణామాలని్నంటినీ చాలా చిన్నవిగా భావిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్‌ తమకే అంటూ ప్రకటించుకున్న నాయకులపై జిల్లా అధ్యక్షుడిగా ఎలాంటి చర్యలకు పూనుకోకుండా ఉదాసీనంగా ఉంటున్నారు. దీంతో ఆశావహులు ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు, స్వచ్ఛంద సంస్థల పేరుతో వేగంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. 

కేసీఆర్‌ గెలుపే లక్ష్యంగా పాదయాత్ర
రామగుండంలో బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసేందుకు అరడజనుకు పైగా పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సీనియర్‌ నాయకుడు, కార్పొరేటర్‌ పాతిపెల్లి లక్ష్మి భర్త పాతిపెల్లి ఎల్లయ్య, టీబీజీకేఎస్‌ నేత మిర్యాల రాజిరెడ్డి, మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొలేటి దామోదర్‌ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

టికెట్‌ ఆశిస్తున్నవారంతా తమ తమ సామాజిక వర్గాల బలాలు, బలహీనతలు, ఖర్చులు, పెట్టుబడులను అంచనా వేసుకొని బీఆర్‌ఎస్‌ పార్టీ పెద్దలతో తమకున్న పరిచయాలతో పాదయాత్రల పేరిట ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోలేటి దామోదర్‌ పాదయాత్రలతో కాకుండా సీఎం కేసీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యంతో టికెట్‌ సాధించే పనిలో ఉన్నారు. అధికార పార్టీలో ఇలాంటి వాతావరణం ఉన్నప్పటికీ ఎలాంటి నియంత్రణలు, క్రమశిక్షణ చర్యలు లేకుండా పోయాయి. ఇది అంతర్గత ప్రజాస్వామ్యానికి సంకేతమా లేక అంతర్గత కలహాలకు నిదర్శనమా అర్థం కావడం లేదని సగటు గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.

నేటి నుంచి ఆశావహుల డివిజన్‌ బాట
గోదావరిఖని(రామగుండం): ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ ఆశావహులు సిద్ధమయ్యారు. శనివారం నుంచి రామగుండం నియోజకవర్గంలో డివిజన్లు, గ్రామాలు, గనులపై పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మేయర్‌ కొంకటి లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకుడు పాతిపెల్లి ఎల్లయ్య తెలిపారు. ఈమేరకు నాయకులు సమావేశమైన ఈవిషయాన్ని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా ప్రజల బాట పట్టినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా, పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. బస్తీలు, గ్రామాలు, గనుల బాట చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే ఏకపక్షంగా అనుసరిస్తూ నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదని ఆశావహులు పేర్కొన్నారు.    

Read latest Peddapalli News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top