పార్వతీపురం రూరల్: పార్వతీపురం మండలం డోకిశీల ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి మంగళవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతి, పారిశుద్ధ్యం, ఆరోగ్య పరిరక్షణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పర్యటన సమయంలో గణిత ఉపాధ్యాయులు విధుల్లో లేకపోవడాన్ని కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు గణిత ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డీఈఓను ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. వారి ఆరోగ్య పరిస్థితి, ఆహారం, విద్యాబోధన, వసతి సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన, పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలని, ఆహార తయారీలో పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అనారోగ్యానికి గురైన వారికి తక్షణ వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు నాణ్యమైన వసతి, భోజనం, ఆరోగ్య సంరక్షణ అందించడం అధికారుల బాధ్యతని స్పష్టం చేశారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల సంక్షేమం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.


