విజయనగరం టౌన్: జిల్లాలోని వివిధ న్యాయస్ధానాల్లో డిసెంబరు 12న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా సంబంధిత పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్.దామోదర్ అధికారులను మంగళవారం ఆదేశించారు. పోలీసుస్టేషన్ పరిధిలో నమోదైన కేసుల్లో ఇరువర్గాలు రాజీ అయ్యేందుకు అవకాశమున్న కుటుంబ వివాదాలు, ఆస్తితగాదాలు, చిన్న క్రిమినల్ కేసులు, ట్రాఫిక్ కేసులు, ఎకై ్సజ్, రోడ్డు ప్రమాద కేసులు, ఇతర కాంపౌండ్ కేసులను ముందుగా గుర్తించాలని సూచించారు. ఆయా కేసుల్లో ఇరువర్గాలతో సంప్రదించి, సమావేశాలు నిర్వహించి, వారు రాజీ అయ్యే విధంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలని చెప్పారు. ఇందుకు గాను పోలీసుస్టేషన్ స్ధాయిలో ప్రత్యేకబృందాలను ఏర్పాటుచేయాలని, ప్రతిరోజూ లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే కేసులను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని, లోక్ అదాలత్ విజయవంతమయ్యేందుకు అధికారులు, సిబ్బంది ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కేసుల్లో ఇరువర్గాలపై ఒత్తిడి లేకుండా, సహకారాత్మక వాతావరణంలో రాజీ అయ్యేలా వారిని ప్రోత్సహించాలని తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే కేసులు త్వరగా, సానుకూలంగా రాజీ అయ్యే అవకాశాలు పెరుగుతాయన్నారు. ఎక్కువ కేసులు లోక్ అదాలత్‌లలో పరిష్కారమయ్యే విధంగా చర్యలు చేపట్టడం వల్ల న్యాయవ్యవస్ధపై భారం తగ్గి, బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే కేసులను ప్రతిరోజూ ఆయా సబ్ డివిజన్‌లకు చెందిన డీఎస్పీలు, సీఐలు పర్యవేక్షించాలని ఆదేశించారు.


