న్యూస్‌రీల్
సాక్షి, పార్వతీపురం మన్యం: ప్రాదేశిక ఎన్నికల్లో ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ తన ఉనికిని చాటుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో పట్టును నిలుపుకొంది. ముఖ్యంగా ఈ ఎన్నికలు అధికార పార్టీకి గొప్ప గుణపాఠం నేర్పాయి. ప్రధానంగా జిల్లాకు చెందిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి గట్టి షాక్ ఇచ్చాయి. తన సొంత నియోజకవర్గంలోనే ఆమెకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో.. సీట్ల సర్దుబాటు విషయంలో మంత్రిమాట చెల్లుబాటు కాలేదు. జనసేనకు కేటాయించడంపై బహిరంగంగానే ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. తీరా ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచే ఇండిపెండెంట్‌గా మంజీరా బరిలో దిగారు. ఆమె వెనుక మంత్రి సంధ్యారాణి ఉన్నారన్నది ఆ పార్టీ వర్గాల నుంచే వినిపించిన మాట. ఇంత చేసినా.. చైర్పర్సన్ కుర్చీ జనసేన ఎగరేసుకుపోయింది. సొంత మున్సిపాలిటీలోనే మంత్రికి ఘోర పరాభవం అనుకుంటే.. ప్రాదేశిక ఎన్నికల్లో సాలూరు మండలంతో పాటు.. ఆమె స్వప్రాంతమైన మక్కువ మండలం జెడ్పీటీసీ స్థానాన్ని వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంది. మక్కువ మండలం ఎంపీపీ స్థానం సైతం వైఎస్సార్ సీపీ ఖాతాలో పడింది. ఇది మంత్రికి కోలుకోలేని దెబ్బ. ఆమె ప్రజా, గిరిజన వ్యతిరేక పనితీరుకు నిలువెత్తు సాక్ష్యం అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. ఈ ప్రాంతానికి చెందిన మంత్రి అయినా గిరిజనులకు చేసిన మేలు, ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి శూన్యమన్న మాట అధికమంది నుంచి వినిపిస్తోంది.
మంత్రి పదవి ఉంటుందా..
ఊడుతుందా?
ఇప్పుడు సాలూరు నియోజకవర్గంతో పాటు.. జిల్లా రాజకీయాల్లో ఇదే చర్చ. గతంలో దివగంత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక ఎన్నికల్లో ఓ ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట్ల రెండు జెడ్పీటీసీ స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. అధికార పార్టీలో ఉండి.. ఈ ఓటమి జీర్ణించుకోలేక, నైతిక బాధ్యత వహిస్తూ.. ఇద్దరు మంత్రులూ.. మంత్రి వర్గం నుంచి తప్పుకున్నారు. నాటి సంఘటనలను జిల్లాలోని సీనియర్ నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికే గిరిజన సంక్షేమం, ఆరోగ్యం, జిల్లాకు సంబంధించిన ఇతర అంశాలలో మంత్రి అపఖ్యాతి పొందారు. ఈ క్రమంలో విస్తరణ సమయానికి మంత్రి పదవి ఊడుతుందన్న ప్రచారం ఎప్పటినుంచో నడుస్తోంది.
సొంత నియోజకవర్గంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి మంత్రి పదవికి సంధ్యారాణి స్వచ్ఛందంగా తప్పుకుంటారా.. లేక అధిష్టానం చర్యలు తీసుకుంటుందా.. అన్న చర్చ జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.


