కొమరాడ: మండలంలోని మసిమండ పంచాయతీ తీగలపాడు గ్రామంలో కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం దీపావళి వేడకల్లో పాల్గొన్నారు. పండగ అనేది కేవలం కుటుంబ సభ్యులతోనే కాకుండా సమాజంలోని ప్రతిఒక్కరి ఆనందాన్ని పంచుకునే సందర్భమని పేర్కొన్నారు. వీవీఓలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. గ్రామస్తుల యోగాక్షేమాలు అడిగి తెలసుకున్నారు.
రంగమూడ జలపాతం ప్రారంభం
తీగలపాడు గ్రామ పరిధిలో ప్రకృతి ఆందాలకు నెలవైన రంగమూడ జలపాతాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ప్రకృతి ఒడిలో కొలువుదీరిన ఈ జలపాతం స్థానిక ప్రాంతానికి పర్యాటక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందన్నారు. రంగమూడ జలపాతం ప్రారంభంతో ఈ ప్రాంతానికి పర్యాటకంగా గుర్తింపు వస్తుందన్నారు.
విద్యార్థులతో కలిసి సబ్‌కలెక్టర్ దీపావళి పండగ
సీతంపేట: అనునిత్యం బిజీబిజీగా ఉండే పాలకొండ సబ్ కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీఓ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఆదివారం రాత్రి స్థానిక గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి దీపావళి పండగ చేసుకున్నారు. టపాసులు కాల్చి సందడి చేశారు. దీనిలో భాగంగా కాకరపువ్వొత్తులు, తాళ్లు, అగ్గిపెట్టెలు వంటివి విద్యార్థులతో పాటుగా వెలిగిస్తూ సరదా సరదాగా గడిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మధుసూదనరావు పాల్గొన్నారు.
తోటపల్లి ఇన్‌ఫిల్టరేషన్ బావుల పరిశీలన
గరుగుబిల్లి: ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధచూపాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. తోటపల్లిలోని ఇన్‌ఫిల్టరేషన్ బావులను సోమవారం ఆయన పరిశీలించారు. నాలుగు బావుల్లో ప్రస్తుతం మూడు మాత్రమే పని చేస్తున్నాయని అధికారులు తెలపగా, మిగిలిన బావికి మరమ్మతులు చేపట్టి త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. కుళాయిల్లో బురదనీరు కాకుండా స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రామ్‌గోపాల్‌ను ఆదేశించారు.
జిల్లా బీసీ సంక్షేమ అధికారిగా కృష్ణ
పార్వతీపురం రూరల్: విజయవాడలో ఏపీ రాష్ట్ర బీసీ కమిషన్ సహాయ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్.కృష్ణకు పార్వతీపురం మన్యం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆ శాఖ డైరెక్టర్ ఎ.మల్లికార్జున సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు ఈ అదనపు బాధ్యతలు చేపట్టిన జిల్లా సాంఘిక సంక్షేమశాఖ సహాయ అధికారిని తక్షణమే ఎఫ్‌ఏసీ విధుల నుంచి రిలీవ్ చేయాలని ఆదేశించారు.


