జీఓ 3 లేకుండానే డీఎస్సీ! | - | Sakshi
Sakshi News home page

జీఓ 3 లేకుండానే డీఎస్సీ!

Nov 10 2026 1:13 AM | Updated on Nov 10 2026 1:13 AM

మళ్లీ మోసం చేయడమే..

● గిరిజన నిరుద్యోగులకు మళ్లీ మొండిచేయి

● హామీ ఇచ్చి రెండున్నరేళ్లవుతున్నా అమలుకు నోచుకోని గిరిజన ఉద్యోగ రిజర్వేషన్‌

సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజన నిరుద్యోగ యువతకు మళ్లీ నిరాశే ఎదురైంది. షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజనులకే ఉపాధ్యాయ ఉద్యోగాలు దక్కేలా జీఓ నంబర్‌ 3ను పునరుద్ధరిస్తామని, లేదంటే దానికి ప్రత్యామ్నాయంగా మరో ఉత్తర్వు తీసుకొస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా ఇప్పటికీ అడుగు వేయలేదు. హామీ అమలుపై స్పష్టత ఇవ్వకుండానే డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలచేయడంతో గిరిజన నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఉపాధ్యాయ కొలువు కోసం...

పార్వతీపురం మన్యం జిల్లాలోని షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో గిరిజన యువతకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాలు అందడం కీలకమైన అంశం. స్థానికంగా చదువుకుని, ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకున్న అనేకమంది గిరిజన నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో జీఓ నంబర్‌ 3 ద్వారా షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో ఉపాధ్యాయ నియామకాల్లో గిరిజనులకు ప్రత్యేక ప్రాధాన్యం లభించేది. న్యాయపరమైన పరిణామాలతో ఆ ఉత్తర్వు అమలులో లేకపోవడంతో గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాల విషయంలో అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీ గిరిజన నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత జీఓ నంబర్‌ 3 పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారని, గిరిజనుల ఉద్యోగ హక్కులకు భరోసా కల్పిస్తారని ఆశించారు. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలమైనా ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. గతంలో ఒక డీఎస్సీ నోటిఫికేషన్‌్‌ విడుదల చేసిన సమయంలోనూ జీఓ 3 లేకపోవడంపై గిరిజన యువత ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా మరోసారి జీఓ 3 పునరుద్ధరణ లేదా ప్రత్యామ్నాయ ఉత్తర్వులపై స్పష్టత లేకుండానే రెండో డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడడం వారిని మరింత నిరాశకు గురిచేస్తోంది. ప్రభుత్వ కొలువు పొందాలని.. గురువుగా రాణించాలని జిల్లా నుంచి వందలాది మంది ఇతర ప్రాంతాల్లో ఉండి.. పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయకపోగా, వరుసగా రెండుసార్లు డీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేయడం గిరిజన నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి స్థానిక గిరిజన ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకం. స్థానిక భాష, సంస్కృతి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఉన్న గిరిజన యువతకు ఉపాధ్యాయ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎప్పుడు అమలు చేస్తుంది? జీఓ 3 పునరుద్ధరణకు లేదా ప్రత్యామ్నాయ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్న ప్రశ్నలు పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన నిరుద్యోగ యువతను వేధిస్తున్నాయి.

రాష్టంలోని కూటమి, చంద్రబాబు ప్రభుత్వం గిరిజన నిరుద్యోగ యువతను మళ్లీ మోసం చేసింది. ఎన్నికలకు ముందు జీఓ నంబర్‌ పునరుద్ధరణ లేదా ఆ తరహా మరో జీఓ తెచ్చి గిరిజన ఉద్యోగాలు గిరిజనులకు ఇస్తానని చంద్రబాబు ఇచ్చిన హామీ అమలు కాలేదు. హామీ అమలు కాకుండానే ఒక డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి షెడ్యూల్డ్‌ ఏరియాలో ఉపాధ్యాయ శిక్షణ పొందిన నిరుద్యోగ గిరిజన యువతను మోసం చేశారు. మళ్లీ ఇప్పుడు కూడా జీఓ నంబర్‌ 3 లేకుండా రెండో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి గిరిజన నిరుద్యోగ యువతను రెండో సారి మోసం చేశారు.

– పి.రంజిత్‌ కుమార్‌,

ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి, గిరిజన సంక్షేమ సంఘం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement