● నూతనోత్సాహంలో వైఎస్సార్‌సీపీ నాయకులు
లక్కవరపుకోట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తా క్రియాశీలక నాయకుడేనని శాసన మండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పార్టీ బలోపేతంలో కార్యకర్తలే కీలకమని, వారి కృషి, అంకితభావమే పార్టీకి బలమని తెలిపారు. ఈ మేరకు ఎస్.కోట మాజీ శాసనసభ్యుడు కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లక్కవరపుకోట మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్, తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడు సంగం గోవిందరావు విజయనగరంలో బొత్స సత్యనారాయణ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో గురువారం చేరారు.ఆయనతో పాటు గ్రామానికి చెందిన 150 కుటుంబాలు వారు సైతం వైఎస్సార్‌సీపీలో చేరారు. వారందరికీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన గోవిందరావు మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నిలబట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా తు.చ తప్పక నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. లక్కవరపుకోట మాజీ సర్పంచ్‌తో పాటు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీకి చెందిన కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గేదెల శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ యడ్ల కిశోర్‌కుమార్, ఎల్.కోట మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ జామి అప్పలరాజు, ప్రముఖ న్యాయవాది తూర్పాటి శివాజీ, పలు గ్రామాల మాజీ సర్పంచ్‌లు ఏడువాక కిశోర్‌కుమార్, కొట్యాడ మహేష్, వైఎస్సార్ సీసీ మండల యూత్ అధ్యక్షుడు తూర్పాటి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.


