● వరి పంటలు, మొక్కజొన్న కండెలు ధ్వంసం
● ఆందోళన చెందుతున్న రైతులు
మక్కువ: అడవుల్లో తిరగాల్సిన ఏనుగులు, మైదాన ప్రాంతాల పొలాల వైపు దారి మళ్లగా, తాజాగా పొలాల బాట నుంచి రోడ్డెక్కాయి. ఏనుగుల గుంపు రహదారులపై సంచరిస్తుండడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎటువంటి జంకు, భయం లేకుండా అడవులలో సంచరించే విధంగా రోడ్లపై ఏనుగులు గుంపు తిరుగుతున్నాయి. ఏనుగుల కదలికలను అటవీశాఖ అధికారులు, ట్రాకర్స్ ఎప్పటికప్పుడు గమనిస్తూ, ఏనుగుల గుంపును అనుసరిస్తున్నారు. అయినప్పటికీ అవి మాత్రం చేయాల్సిన నష్టాన్ని చేస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
నష్టపోతున్న రైతులు
మండలంలోకి ఏనుగులు ప్రవేశించి సుమారు పది రోజులు దాటిపోతోంది. వరి పంటలను నాశనం చేయడంతో పాటు, రైతులు పొలాల్లో, కళ్లాలు, రహదారులపై ఎండబెట్టిన మొక్కజొన్న కండెలను తినివేస్తుండడంతో రైతులు నష్టపోతున్నారు. అలాగే అక్కడక్కడ వ్యవసాయ పంపు సెట్లు పాడుచేశాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఏనుగులను మచ్చికచేసుకుని, వాటిని తరలించేందుకు కుంకీ ఏనుగులను తీసుకువచ్చినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని పలువురు విమర్శిస్తున్నారు. ఏనుగులు మన్యం జిల్లాలోకి ప్రవేశించి సుమారు 10 ఏళ్లు కావస్తోంది. అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడంతో మన్యం ప్రజలకు గజరాజుల నుంచి అవస్థలు తప్పడంలేదని వాపోతున్నారు. గతంలో నాలుగు ఏనుగులు మన్యం జిల్లాలోకి ప్రవేశించగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఎనిమిదికి చేరింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఏనుగుల గుంపును తరలించేలా చర్యలు చేపట్టకపోతే వాటి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం లేకపోలేదు. ఏనుగుల సంఖ్య పెరిగే కొద్దీ మరింత విధ్వంసం జరిగే అవకాశం ఉంటుందని మన్యం ప్రజలు ఆవేదన చెందుతున్నారు.


