కశ్మీర్‌ మారథాన్‌–2026కు దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ మారథాన్‌–2026కు దరఖాస్తుల ఆహ్వానం

Oct 14 2026 4:05 AM | Updated on Oct 14 2026 4:05 AM

పార్వతీపురం రూరల్‌: జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం అక్టోబర్‌ 25, 2026న శ్రీనగర్‌లో ’3వ ఎడిషన్‌ కాశ్మీర్‌ మారథాన్‌–2026ను నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి డాక్టర్‌ కె.శ్రీధర్‌ రావు మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఈ మారథాన్‌కు సంబంధించి ఫుల్‌ మారథాన్‌ ఓవరాల్‌ విజేతలకు రూ. 25 లక్షలు, అలాగే హాఫ్‌ మారథాన్‌ సీ్త్ర, పురుషుల విభాగాల్లో విజేతలకు రూ.15 లక్షలు చొప్పున నగదు బహుమతి అందజేయనున్నారు. 18 సంవత్సరాలు పైబడిన సీ్త్ర, పురుషులు ఈ పోటీలకు అర్హులు. రిజిస్ట్రేషన్‌ ఫీజు రూ.2200 గా నిర్ణయించారు. 42 కిలోమీటర్ల ఈ మారథాన్‌ పిక్చర్‌ స్క్వేర్‌ రూట్‌, దాల్‌ లేక్‌, చినార్‌ ట్రీస్‌, మొఘల్‌ గార్డెనన్స్‌ గుండా సాగుతుంది. ఆసక్తి గల పార్వతీపురం మన్యం జిల్లా యువతీయువకులు ‘హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కశ్మీర్‌మారథాన్‌.జెకె.జిఓవి.ఇన్‌‘ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌న్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు ఫోన్‌ 9866805716, 7396423490 నంబర్లను సంప్రదించవచ్చు.

తహసీల్దార్‌ కార్యాలయం ఆకస్మిక తనిఖీ

మక్కువ: మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌ సచిన్‌ అర్చిత్‌ రహార్‌ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలోని పలు కీలక రికార్డులను పరిశీలించి, సిబ్బంది పనితీరును అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అర్జీలను నిర్ణీత గడువులోగా విచారించి ప్రజలకు గుణాత్మకమైన సేవలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలోని ఈవీఎంల భద్రతా గదిని (స్ట్రాంగ్‌ రూమ్‌) సబ్‌ కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద ఏర్పాటు చేసిన రక్షణ చర్యలు, సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ భానుప్రసాద్‌, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఆధునిక సాగు పద్ధతులతో పెట్టుబడి ఆదా

గరుగుబిల్లి: ఆధునిక సాగు పద్ధతులతో పెట్టుబడి ఆదా అవుతుందని రైతు సాధికార సంస్థ (ఆర్‌వైఎస్‌ఎస్‌) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి టి.బాబురావునాయుడు అన్నారు. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నూతన పద్ధతులు పాటించడం వల్ల తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. గరుగుబిల్లి మండలం సంతోషిపురంలో వరి పంటలో సుడిదోమ నివారణకు తూటికాడ కషాయాన్ని డ్రోన్‌తో పిచికారీ చేశారు. డ్రోన్‌తో పిచికారీ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమంలో రీజినల్‌ థీమాటిక్‌ లీడ్‌ కె.ప్రకాష్‌ మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఆరుతడి పంటలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ప్రబంధకుడు ఎం.శ్రావణ్‌ కుమార్‌నాయుడు, ఏఈఓ ఎ.హరీష్‌, మండల ఇన్‌చార్జి వి.పోలినాయుడు, వెంకట్‌నాయుడు, ప్రసాద్‌, గంగ, నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా అదనపు ఎస్పీగా పద్మలత

విజయనగరం టౌన్‌: జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌)గా ఎ.పద్మలతను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కుమార్‌ విశ్వజీత్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఆమె ఇప్పటివరకూ సీఐడీ విభాగంలో అదనపు ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇక్కడ అదనపు ఎస్పీ(అడ్మిన్‌)గా పనిచేసిన సౌమ్యలతను విజిలెన్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement