● ప్రలోభాలకు లొంగొద్దు
● స్థానిక ఎన్నికలపై పార్టీ శ్రేణులకు రాజన్నదొర దిశానిర్దేశం
సాలూరు: ఎటువంటి ప్రలోభాలకు లొంగవద్దు.. బెదిరింపులకు భయపడవద్దు.. రానున్న స్థానిక సంస్థలతో పాటు అన్ని ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేద్దామని వైఎస్సార్ సీపీ శ్రేణులకు మాజీ డిప్యూటీ సీఎం, పార్టీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. సాలూరు మండలం మరిపల్లిలో వైఎస్సార్‌సీపీ కమిటీ సభ్యులకు ఐడీ కార్డులను మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇచ్చిన హామీలను అమలుచేయకుండా గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందన్నారు. జీఓ 3 పునరుద్ధరించిలేదని, షెడ్యూల్ గ్రామాల గుర్తింపు తదితర హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో వెన్నుపోటు పార్టీకి బుద్ధిచెప్పేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ చేయూత కింద ఏడాదికి రూ.18,500 ఇవ్వగా, చంద్రబాబు ప్రభుత్వం సూపర్‌సిక్స్‌లో భాగంగా ఆడబిడ్డ నిధి కింద ప్రతినెల రూ.1500 ఇస్తామని ఇచ్చిన హామీని అమలు చేయకుండా మహిళలను మోసం చేశారన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ముంచేశారన్నారు. ఇవన్నీ ప్రజలకు వివరించి స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు దండి శ్రీనివాసరావు, రెడ్డి సురేష్, పెద్దింటి మాధవరావు, మువ్వల ఆదయ్య, తదితరులు పాల్గొన్నారు.


