● రిజర్వేషన్ ఖరారు
● రేసులోకి ఆశావహులు
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం మన్యం జిల్లా పరిషత్ అధ్యక్ష స్థానాన్ని గిరిజనులకే (షెడ్యూల్డ్ ట్రైబ్) కేటాయించారు. ఈ మేరకు మంగళవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. జిల్లా ఏర్పడిన తర్వాత తొలి జెడ్పీ చైర్మన్ పీఠం ఎస్టీ(జనరల్)లకే కేటాయించడం గమనార్హం. 2022లో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని కొంత భాగాలతో కలిసి నాలుగు నియోజకవర్గాలుగా పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడిన విషయం విదితమే. ఇందులో పార్వతీపురం ఎస్సీ కాగా.. సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాలు ఎస్టీగా ఉన్నాయి. ఇప్పటివరకు ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్‌గానే సాగింది. గత నెల 24వ తేదీతో ప్రస్తుత జెడ్పీ సభ్యుల పదవీకాలం పూర్తి కావడంతో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లా పరిషత్‌లు ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా 15 మండలాలతో మన్యం జిల్లా పరిషత్ ఆవిర్భవించింది. ఈ మండలాల్లో ఎంపీపీల పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. జిల్లా పరిషత్ పరిధిలో 15 జెడ్పీటీసీ, 226 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 6.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ దఫా జెడ్పీపీఠం అధిరోహించిన వారు.. మన్యం జిల్లా పరిషత్ తొలి చైర్మన్‌గా చరిత్రకెక్కనున్నారు.
తొలి జెడ్పీ అధ్యక్షునిగా బరిలో నిలిచేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నారు. టీడీపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. మిత్ర పక్షం జనసేన పార్టీకి పొత్తుల్లో భాగంగా కేటాయిస్తే మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు పేరు కూడా చర్చలోకి వస్తోంది. ఇదే సమయంలో పాలకొండ జనసేన పార్టీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ కుటుంబం నుంచి కూడా పోటీపడుతున్నట్లు సమాచారం. అవసరమైతే పాలకొండ నగర పంచాయతీ పీఠాన్ని వదులుకోవడానికై నా జనసేన నుంచి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాలకొండకే చెందిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి తమ కుటుంబం నుంచి కూడా బరిలోకి దింపాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావుతో వీరికి బంధుత్వం కూడా ఉంది. ఆ విధంగానూ ప్రయత్నాలు చేస్తున్నట్లు వినిపిస్తోంది. వైఎస్సార్సీపీ కూడా ఆ పార్టీ నుంచి బలమైన అభ్యర్థిని బరిలో దించే యోచనలో ఉంది.


