● 17న పార్వతీపురంలో రైతుల ప్రదర్శన
పార్వతీపురం రూరల్: జంఝావతి ప్రాజెక్టును పూర్తిచేసే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సాధన సమితి, గ్లోబల్ స్ఫూర్తి డెవలప్‌మెంట్ సొసైటీ నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్వతీపురంలో జరుగుతున్న జంఝావతి సాధన దీక్షలు మంగళవారానికి 22వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు మద్దతుగా గ్లోబల్ స్ఫూర్తి సొసైటీ సభ్యులు చర్చి వీధి పార్కు నుంచి శిబిరం వరకు ర్యాలీ నిర్వహించారు.ఐదు దశాబ్దాలుగా ప్రాజెక్టు పూర్తికాక రైతులకు నష్టం జరుగుతోందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్రం, ఒడిశాలో ఎన్డీఏ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ప్రాజెక్టును పూర్తిచేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాజెక్టు సాధన కోసం ఈ నెల 17న పార్వతీపురంలో రైతుల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో స్ఫూర్తి సొసైటీ రాష్ట్ర అధ్యక్షురాలు బలగ రాధానాయుడు, ఉపాధ్యక్షుడు అనంతరావు, సాధన సమితి నాయకులు చుక్క భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


