ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

Oct 13 2026 12:47 AM | Updated on Oct 13 2026 12:47 AM

● అర్జీదారులతో మాట్లాడి

క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

● కలెక్టర్‌ డా. ఎన్‌. ప్రభాకరరెడ్డి

పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యమని, ప్రజల నుంచి అందిన ప్రతీ అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్‌ డా. ఎన్‌. ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌, రెవెన్యూ క్లినిక్‌ కార్యక్రమంలో జేసీ ఆర్‌.వైశాలితో కలిసి ప్రజల నుంచి మొత్తం 75 అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు రహదారులు, రేషన్‌ కార్డులు, ఉద్యోగాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, భూ రికార్డుల సమస్యలపై వినతులను సమర్పించారు. అర్జీలను పరిశీలించిన కలెక్టర్‌ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కఠిన చర్యలు తీసుకోవాలని, పెండింగ్‌ అర్జీలను ప్రత్యేకంగా సమీక్షించి జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు ఒకే సమస్యపై పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. 1100 టోల్‌ ఫ్రీ సేవల ద్వారా అందే ఫిర్యాదులను కూడా సత్వరం పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్లు ఆర్చిత్‌ సచిన్‌ రహార్‌, పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్‌ఓ కె.హేమలత, ఎస్‌డీసీ ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు వైబ్రేషన్‌ స్టిక్‌, వినికిడి యంత్రం అందజేత

పార్వతీపురం: పీజీఆర్‌ఎస్‌లో అందిన దరఖాస్తులపై స్పందించిన కలెక్టర్‌ డా. ఎన్‌. ప్రభాకరరెడ్డి ఇద్దరు అర్జీదారులకు వైబ్రేషన్‌ స్టిక్‌, వినికిడి యంత్రాన్ని అందజేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో పార్వతీపురానికి చెందిన సీహెచ్‌ విజయకుమార్‌ వైబ్రేషన్‌ స్టిక్‌, కురుపాం మండలానికి చెందిన ఎం.కృష్ణమూర్తి వినికిడి యంత్రం కోసం అర్జీలను సమర్పించారు. వాటిని పరిశీలించిన కలెక్టర్‌ తక్షణమే స్పందించి అవసరమైన పరికరాలను అందజేశారు. కార్యక్రమంలో జేసీ ఆర్‌.వైశాలి, సబ్‌కలెక్టర్లు ఆర్చిత్‌ సచిన్‌, రహర్‌, పవర్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌, డీఆర్‌ఓ కె. హేమలత తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదులపై సత్వర చర్యలు

పార్వతీపురం రూరల్‌: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ కలహాలు, సైబర్‌ మోసాలు, భూ వివా దాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, మహిళలపై వేధింపులు తదితర సమస్యలకు సంబంధించి 5 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎస్పీ.. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వాస్తవాలను నిర్ధారించుకుని చట్టపరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే, ఆయా చర్యల నివేదికలను జిల్లా కార్యాలయానికి పంపాలని స్పష్టం చేశారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించే ఈ వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ జీఏవీ రమణ, ఎస్సై అశోక్‌ చక్రవర్తి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఐటీడీఏ పీజీఆర్‌ఎస్‌కు 33 వినతులు

సీతంపేట: సీతంపేట ఐటీడీఏలో సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్‌కు 33 వినతులు వచ్చాయి. పాలకొండ సబ్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీఓ పవార్‌ స్వప్నిల్‌ వినతులు స్వీకరించారు. టెక్నికల్‌ పోస్టులో తనను నియమించాలని తొత్తడికి చెందిన ప్రమీల కోరారు. సీతంపేట గ్రామం నుంచి ఎగువముల్లెల గూడ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మించాలని అడ్డంగి గ్రామస్తుడు శివ కోరారు. దుగ్గికి చెందిన కొండగొర్రె పెంటయ్య వ్యవసాయ పైపులు ఇప్పించాలని విన్నవించాడు. మేకల కొనుగోలుకు రుణం ఇప్పించాలని మామిడిమానుగూడ గ్రామానికి చెందిన ఆరిక బోడమ్మ కోరింది. ఈతమాను గూడకు చెందిన సవర అమల తదితరులు అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదని ఫిర్యాదు చేశారు. ఉల్లిమానుగూడకు చెందిన సవర సుంకయ్య వ్యవసాయ కాలువకు మరమ్మతులు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, డిప్యూటీ ఈఓ నారాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement