● ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్
వంగర: రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ అన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం వంగరలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల సంభవించిన తుపాను కారణంగా కొప్పర, కొండచాకరాపల్లి, గీతనాపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయని, ఆయా గ్రామస్తులకు పునరావాస సౌకర్యాలు సకాలంలో కల్పించడంలో ప్రభుత్వ, అధికార యంత్రాంగం విఫలమయ్యాయన్నారు. ఆయా గ్రామాల్లో సువర్ణముఖి నది ఉధృతి వల్ల పంటలకు తీవ్రనష్టం జరిగిందని, ఏ ఒక్క రైతును ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. నష్టం వాటిల్లిన రైతులకు ఎకరాకు రూ.20 వేలు అందజేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిష్పక్షపాతంగా పంటల బీమా పథకాన్ని అమలు చేశారని, ప్రీమియం డబ్బులు ప్రభుత్వమే చెల్లించి రైతులు సాగు చేసిన పంటలకు రక్షణ కల్పించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు కరణం సుదర్శనరావు, మండల యూత్ విభాగం అధ్యక్షుడు బొక్కేల వెంకటప్పలనాయుడు, మాజీ ఎంపీటీసీ కనగల పద్మ, దేవకివాడ దుర్గప్పలనాయుడు, పాలవలస ధవళేశ్వరరావు పాల్గొన్నారు.


