పార్వతీపురం రూరల్: జిల్లా పింఛనుదారుల అక్టోబరు నెలవారీ సమావేశం ఈ నెల 12వ తేదీ ఉదయం 10 గంటలకు జరగనుంది. స్థానిక రైతుబజారు దరి ఉన్న పింఛనుదారుల భవన సముదాయంలో ఈ సదస్సును నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు ఎ.త్రినాధం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి భారత స్టేట్ బ్యాంకు రీజనల్ మేనేజరు హాజరు కానున్నారని, సీనియరు సిటిజన్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న సైబరు నేరాలు, డబ్బు దొంగలింపులు, డిజిటల్ అరెస్టుల వంటి వాటి బారిన పడకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరిస్తారని పేర్కొన్నారు. బ్యాంకుల్లో సీనియరు సిటిజన్లకు లభించే రాయితీల గురించి కూడా అవగాహన కల్పిస్తారని, కావున పింఛనుదారులందరూ ఈ సమావేశానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సంఘం అధ్యక్షుడు కోరారు.
కరాటే పోటీల్లో 22 పతకాలు
విజయనగరం అర్బన్: సత్య డిగ్రీ, పీజీ కళాశాల గ్రౌండ్స్‌లో శిక్షణ పొందుతున్న వివిధ పాఠశాలల విద్యార్థులు జాతీయ స్థాయి కరాటే పోటీల్లో 22 పతకాలు సాధించారు. అక్టోబర్ 4న కొత్తవలస సమీపంలోని తుమ్మికపల్లె గ్రామం వీరభద్రపురంలోని ఎన్‌ఎస్‌ఆర్ కల్యాణ వేదికలో నిర్వహించిన ఇన్విటేషన్ నేషనల్ కరాటే ఛాంపియన్‌షిప్–2026 (ఛాంపియన్స్ కప్ 3.0)లో 5 బంగారు, 6 వెండి, 11 కాంస్య పతకాలు కై వసం చేసుకున్నారు. ఒకినావా స్పోర్ట్స్ కరాటే–డో అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జరిగిన పోటీల్లో కుమిటే, కాటా విభాగాల్లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కోచ్‌లు సంతోష్, అసిస్టెంట్ కోచ్ సుధీర్, పిభార్గవ్‌లను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ సాయిదేవమణి అభినందించారు.


