సాలూరు: ఆంధ్రా – ఒడిశా వివాదాస్పద కొటియా గ్రూపు గ్రామాల్లో ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు, సబ్ డివిజన్ డీఎస్పీ సీహెచ్వీ శేషయ్య ఆధ్వర్యంలో పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. దొర్లతాడివలస, మూలతాడివలస, ధూళిభద్ర గ్రామాల సమీపంలో కొండ ప్రాంతాల్లో నాటుసారా తయారీ జరుగుతున్నట్టు గుర్తించిన పోలీసులు ప్రత్యేకంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో నాటుసారా తయారీకి వినియోగిస్తున్న 14 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన సుమారు 2800 లీటర్ల బెల్లం ఊటతో పాటు మూడు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.లక్ష ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పోలీసులు తనిఖీతో నాటుసారా తయారీలో నిమగ్నమైన వ్యక్తులు అక్కడి నుంచి పరారయ్యారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు డీఎస్పీ తెలిపారు. రూరల్ సీఐ రామకృష్ణ, సాలూరు, మక్కువ మండలాల ఎస్ఐలు రవీంద్రరాజు, వెంకటరమణతో పాటు ఎస్టీఎఫ్, ఈగల్ విభాగాలకు చెందిన సుమారు 30 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.


