సమస్యలా.. అక్కడ ఆగు! | - | Sakshi
Sakshi News home page

సమస్యలా.. అక్కడ ఆగు!

Oct 10 2026 12:46 AM | Updated on Oct 10 2026 12:46 AM

అంతా బాగు..

సాక్షి, పార్వతీపురం మన్యం: గిరిజనుల సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి కార్యాచరణ రూపొందించాల్సిన పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు రాజకీయ ఆధిపత్య ప్రదర్శనకు వేదికగా మారాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని గిరిజన సమస్యలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల అనారోగ్య సమస్యలు, గ్రామాల్లో కనీస సౌకర్యాల కొరత వంటి అంశాలపై సమగ్ర చర్చ జరగాల్సి ఉండగా.. సమావేశంలో నిధుల కేటాయింపులు, తమకు సమాచారం ఇవ్వలేదంటూ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత నిర్వహించిన సమావేశాల తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రభుత్వం మారాక తొలిసారి...

గురువారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో నిర్వహించిన 75వ పాలకవర్గ సమావేశంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈ సమావేశం నిర్వహించడం.. పేరుకుపోయిన సమస్యలపై ఎంతవరకు చర్చ జరిగిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకోసారి నిర్వహించాల్సిన సమావేశాలను ఇంతకాలం ఎందుకు నిర్వహించలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ప్రశ్నించే గొంతుకలను పక్కన పెట్టేందుకేనా?

గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లడంలో ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు కీలక పాత్ర పోషిస్తారు. గ్రామస్థాయిలో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారుల ముందు ప్రస్తావించేందుకు పాలకవర్గ సమావేశాలు కీలక వేదికలుగా నిలుస్తాయి. ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగిసే వరకు సమావేశాలు నిర్వహించకపోవడంపై తాజా మాజీ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పదవుల్లో ఉన్నప్పుడే సమావేశం నిర్వహించి ఉంటే క్షేత్రస్థాయిలోని సమస్యలు, అధికారుల పనితీరుపై ప్రశ్నలు ఎదురయ్యేవని, అందుకే సమావేశాల నిర్వహణలో జాప్యం జరిగిందా? అన్న అనుమానాలను వారు వ్యక్తం చేస్తున్నారు.

గిరిజనుల ప్రాణాల కంటే ప్రాధాన్యాలే ముఖ్యమా?

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పలువురు విద్యార్థులు మరణించిన సంఘటనలు కోకొల్లలు. ఇటీవల అనసభద్ర ఘటనలో విద్యార్థి కుటుంబానికి రూ.3 లక్షల పరిహారం ప్రకటించి, అందజేశారు. ఇదే సమయంలో గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా కనీస చలనం పాలకుల్లో లేదు. కురుపాం ఘటనలో పచ్చకామెర్లతో ఇద్దరు విద్యార్థులు చనిపోతే ఆ కుటుంబాలకు పరిహారం ఊసు లేదు.

సాలూరులో గోడ కూలి విద్యార్థి చనిపోతే.. పరిహారం ఇస్తామని చెప్పి, విస్మరించారు. గిరిజన గ్రామాల్లో ఇప్పటికీ మౌలిక సదుపాయాల కొరత, వైద్య సేవల అందుబాటులో ఇబ్బందులు, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ వంటి సమస్యలు ప్రాధాన్య పరిష్కారాన్ని కోరుతున్నాయి. ఇటువంటి కీలక అంశాలపై పాలకవర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి, స్పష్టమైన కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉంది. అందుకు భిన్నంగా అన్ని చోట్లా ‘బాగు’ అని అధికారులు చెప్పడం.. దానికి ప్రజాప్రతినిధులు ‘కూటమి ప్రభుత్వం’లో అంతే! అంటూ తలూపడానికే సరిపోయింది. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలేమిటి? గిరిజన గ్రామాలకు వైద్య సేవలు ఎంతవరకు అందుతున్నాయి? మౌలిక సదుపాయాల కల్పనలో ఎదురవుతున్న అడ్డంకులేమిటి? పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు ఎప్పుడు పూర్తవుతాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి ఉన్నా.. వీటి కంటే ఎక్కడ నిధులున్నాయి, ఆ పథకాల కోసం తమకు ఎందుకు చెప్పలేదని రాజకీయ ఆధిపత్యం చూపించడానికే సమావేశాన్ని ప్రజాప్రతినిధులు పరిమితం చేశారు.

ఐటీడీఏ పరిధిలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించే నిధులు, వాటి వినియోగం, ప్రాధాన్య క్రమంలో చేపట్టాల్సిన పనులపై చర్చ జరగడం సహజం. ఆ నిధుల కేటాయింపుల చర్చ ప్రజల అవసరాలు, వెనుకబడిన గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా సాగాలి. తమకు సమాచారం అందించలేదంటూ అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేయడం కంటే, గిరిజనులకు అందాల్సిన ప్రయోజనాలు పూర్తిస్థాయిలో అందుతున్నాయా? అన్న అంశంపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించలేదు. ఐటీడీఏ పరిధిలో వీడీవీకేలు – యంత్రాల కొనుగోలు, ట్రైకార్‌ రుణాలు, నైపుణ్య శిక్షణ వంటి అంశాల్లో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనిపై కనీస చర్చ జరగలేదు. గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే నిర్ణయాలు తీసుకోవడం, వాటి అమలుపై సమీక్ష నిర్వహించడం, బాధ్యతలను నిర్దేశించడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన వేదికలో... సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలనేవి కేవలం నిధుల కేటాయింపులు, అధికారుల వివరణలు, నాయకుల మధ్య ఆధిపత్య పోరుకే పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఐటీడీఏలో ఏళ్ల నిర్లక్ష్యం..

గిరిజనుల సమస్యలపై మౌనం

ఐదేళ్ల విరామం తర్వాత భేటీ..

ఆదివాసీల ఇబ్బందులపై

చర్చ కరువు

గిరిజనుల గోడు వినాల్సిన వేదికలో ఆధిపత్య పోరు

నిధుల వాటాపైనే ఆసక్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement