భామిని:
ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన నేరడి బ్యారేజ్‌ను సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) నియమించిన సూపర్ వైజరీ కమిటీ గురువారం సందర్శించింది. కమిటీ చైర్మన్, చీఫ్ ఇంజినీర్ జి.నాగమోహన్ (భువనేశ్వర్) ఆధ్వర్యంలో కో ఆర్టినేటర్ ఎస్ఈ ఆదిత్య ఎస్.ఎస్.మూల, చీఫ్ ఇంజినీర్ అరుణకుమార్ పాలో బ్యారేజ్ స్థలాన్ని పరిశీలించారు. వీరికి ఇక్కడి సమస్యను ఉత్తరాంధ్ర చీఫ్ ఇంజినీర్ కె.శేషుబాబు, వంశధార ఎస్ఈ రామచంద్రరావు వివరించారు. వివాదస్పదంగా మారిన ఒడిశాకు చెందిన 106 ఎకరాల భూమిపై కమిటీ సభ్యులు వివరాలు సేకరించారు. ముందుగా కాట్రగడ–బి వద్ద నిర్మించిన ఓపెన్ హెడ్ చానల్, స్లైడ్ వియ్యర్, హెడ్ స్లూయిజ్ పనితీరు పరిశీలించి వంశధార నదిలో ప్రవాహ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఒడిశా గజపతి జిల్లా కలెక్టర్‌తో సమావేశమయ్యారు. కలెక్టర్‌తో కలిసి బ్యారేజీ నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే ఒడిశా తీరంలోని సర, బడిగాం గ్రామాలను పరిశీలించారు. గ్రామస్తులు అభ్యర్థనలు ఆలకించారు. పూర్తి రక్షణ ఏర్పాట్లు జరిగాకే బ్యారేజీ నిర్మాణం సాగుతుందని స్పష్టంచేశారు. కార్యక్రమంలో వంశధార డీఈఈ భవానీ శంకర్, సీడబ్ల్యూసీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.


