గంట్యాడ: మండలంలోని బురదపాడు గ్రామానికి చెందిన లచ్చిరెడ్డి వెంకట్రావు(45) పాము కాటుతో గురువారం మృతిచెందాడు. పొలం పనులకు వెళ్తుండగా గట్టుపై పాము కాటేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య వరలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు.
చెరువులో పడి మరో వ్యక్తి..
గంట్యాడ: మండలంలోని చిన్నమానాపురం గ్రామానికి చెందిన పాసల రమాకాంత్(34) కారు ప్రమాదంలో మృతిచెందాడు. బుధవారం రాత్రి కొటారుబిల్లి మీదుగా చిన్నమానాపురం వెళ్తుండగా నీలావతి పెట్రోల్ స్టాక్ పాయింట్ వద్ద కారు అదుపుతప్పి గంట్యాడ పెద్దచెరువులోకి దూసుకెళ్లింది. కారును నడుపుతున్న రమాకాంత్ నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు ఎస్సై సాయికృష్ణ తెలిపారు. మృతుడికి తల్లి, సోదరుడు ఉన్నారు.


