యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

యథేచ్ఛగా గ్రావెల్‌ తవ్వకాలు

● పాఠశాల, ఆర్డీఓ కార్యాలయానికి

పొంచి ఉన్న ప్రమాదం

● ఆర్డీఓకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులు

● చర్యలకు ఆదేశించిన ఆర్డీఓ

చీపురుపల్లి: గ్రావెల్‌ అక్రమ తవ్వకాలకు బడి, గుడి ఎలాగూ లేదు సరికదా సాక్షాత్తు ఆర్డీఓ కార్యాలయం ఉన్నా కూడా అక్రమార్కులు లెక్క చేయడం లేదు. కొండ కనిపిస్తే గ్రావెల్‌ తవ్వడమే పనిగా పెట్టుకున్నారు. అది కూడా రాత్రి సమయాల్లో జేసీబీ యంత్రాలతో కొండలు తవ్వి, లారీలు, ట్రాక్టర్లలో గ్రావెల్‌ రవాణా సాగిస్తున్న అక్రమార్కులు పగలు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఇదంతా ఎక్కడో కాదు సాక్షాత్తు రెవెన్యూ డివిజిన్‌ కార్యాలయాన్ని ఆనుకుని, రామాంజనేయకాలనీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలోనే జరుగుతున్నప్పటికీ అక్రమార్కుల ఆగడాలను అడ్డుకునేదెవరో తెలియడం లేదు. కొద్దికాలం క్రితం సైతం ఇదే కొండల్లో ఇష్టారాజ్యంగా గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరిగాయి. అప్పట్లో కూడా అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం ఎలాంటి చొరవ చూపించకపోవడంతో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో తాజాగా మళ్లీ చీపురుపల్లి– గరివిడి పట్టణాల మధ్య రామాంజనేయకాలనీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, రెవెన్యూ డివిజిన్‌ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న కొండల్లో రాత్రి సమయాల్లో అక్రమార్కులు గ్రావెల్‌ తవ్వకాలు ప్రారంభించారు. దీనిపై స్వయంగా ఉపాధ్యాయులే ఆర్డీఓ సుధారాణికి ఫిర్యాదు చేశారు. దీనికి స్పందించిన ఆర్డీఓ సుధారాణి తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారు.

అక్రమ తవ్వకాలతో ప్రమాదంలో పాఠశాల

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరుపుతున్న కొండకు దిగువ భాగంలో రామాంజనేయకాలనీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాల పరిసరాల్లో కొండ వరకు ఆట స్థలం క్రింద ఉపాధ్యాయులే చదును చేయించారు. తాజాగా అక్రమార్కులు రాత్రి సమయాల్లో కొండ కింద భాగంలో జేసీబీ యంత్రాలతో గ్రావెల్‌ తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో వర్షాలు కురిసినప్పుడు కొండ మట్టి పెళ్లలు విరిగిపడితే అదే సమయంలో విద్యార్థులు అక్కడ ఆడుకుంటే పెద్ద ప్రమాదం జరుగుతుందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. అంతేకాకుండా గ్రావెల్‌ కోసం తవ్వకాలు జరిపే ప్రాంతంలో వర్షాలు కురిసినప్పుడు నీళ్లతో నిండి ఉండడం ఆ గుంతల్లోకి పొరపాటున విద్యార్థులు వెళ్తే ప్రమాదం తప్పదని ఆందోళన చెందుతున్నారు.

ఆర్డీఓ కార్యాలయం ఉందన్న భయం కూడా లేకుండా..

గ్రావెల్‌ అక్రమ తవ్వకాలు జరిపే కొండను ఆనుకుని రామాంజనేయకాలనీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉండడం ఒకెత్తు అయితే అదే కొండను ఆనుకుని రెవెన్యూ డివిజినల్‌ కార్యాలయం కూడా ఉంది. ఆర్డీఓ కార్యాలయం ఉందనే భయం కూడా అక్రమార్కుల్లో లేదనే చర్చ జరుగుతోంది. దాదాపు ఆర్డీఓ కార్యాలయం ప్రహరీ వరకు గ్రావెల్‌ తవ్వకాలు జరపడం కొసమెరుపు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement