రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు జిల్లా జట్ల పయనం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు జిల్లా జట్ల పయనం

Oct 9 2026 1:14 AM | Updated on Oct 9 2026 1:14 AM

విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న రగ్బీ అండర్‌–14 బాల, బాలికల పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు గురువారం పయనమయ్యారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు అన్నమయ్య జిల్లాలోని వాయలపాడు మండలం కోటమంచూరులో జరగనున్న పోటీలకు 25 మంది క్రీడాకారులు విజయనగరం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ మేరకు క్రీడాకారులకు జిల్లా స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ కార్యదర్శులు ఆర్‌.వాణిశ్రీ, బి.శ్రీనివాసరావులు సూచనలు, సలహాలు చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించడం ద్వారా క్రీడాకారులు తమ ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రెండు ముక్కలైన విద్యుత్‌ స్తంభం

● విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టరు

బొండపల్లి: మండలంలోని కనిమెరక–దేవుపల్లి గ్రామాల మధ్య ఎంఎన్‌ చానల్‌ గట్టుకు అనుకుని గ్రావెల్‌ లోడుతో వస్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి హెచ్‌టీ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టడంతో ఆ స్తంభం రెండు ముక్కలైంది. గురువారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రావెల్‌ లోడుతో ట్రాక్టర్‌ డ్రైవర్‌ మితిమీరిన వేగంతో వెళ్తూ అదుపు తప్పడంతో పక్కనే ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో జరిగిన ప్రమాదంలో 17 గ్రామాలకు విద్యుత్‌ సరఫరా అయ్యే ప్రధాన స్తంభం రెండు ముక్కలైపోయింది. అయితే అదృష్టవశాత్తు ట్రాక్టర్‌ డ్రైవర్‌తో పాటు, కూలీలు, రహదారిపై ప్రయాణాలు సాగించే వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విరిగిపోయిన స్తంభాన్ని మార్చి ఎటువంటి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఏఈఈ శంకర్రావు తెలిపారు.

ప్రొఫెసర్‌ లజపతిరాయ్‌కు స్పిరిచ్యువల్‌ సైంటిస్ట్‌ అవార్డు

నెల్లిమర్ల రూరల్‌: ప్రముఖ విద్యావేత్త, మాజీ వైస్‌ చాన్సలర్‌, రామాయణ పరిశోధకుడు ప్రొఫెసర్‌ హనుమంతు లజపతిరాయ్‌ను ప్రతిష్టాత్మక స్పిరిచ్యువల్‌ సైంటిస్ట్‌ అవార్డుకు ఎంపిక చేసినట్లు అసావేరి సెంటర్‌ ఫర్‌ ఇండిక్‌ నాలెడ్జ్‌ సిస్టమ్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్‌ డాక్టర్‌ కృష్ణవీర్‌ అభిషేక్‌ తెలిపారు. ఈ మేరకు మండలంలోని టెక్కలి గ్రామంలో ఉన్న సెంచూరియన్‌ యూనివర్సిటీలో గురువారం ఆయన మాట్లాడారు. వచ్చే నెల విశాఖలో అవార్డును ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. విద్య, ప్రజా పరిపాలన, రామాయణ పరిశోధన, సామాజిక రంగాల్లో ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు.

కోడిగుడ్ల వ్యాన్‌ బోల్తా

● పగిలిపోయిన రూ.1.50లక్షల విలువ చేసే గుడ్లు

తెర్లాం: మండలంలోని లోచర్ల వద్ద కోడిగుడ్లతో వెళ్తున్న వ్యాన్‌ బోల్తా పడడంతో సుమారు రూ.లక్షా 50వేల విలువ చేసే కోడిగుడ్లన్నీ పూర్తిగా పగిలిపోయాయి. రాజాం నుంచి బలిజిపేట వెళ్లేందుకు కోడిగుడ్ల వ్యాన్‌ గురువారం ఉదయం పణుకువలస మీదుగా వస్తోంది. లోచర్ల వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి రోడ్డుపై ఎండ బెట్టిన మొక్కజొన్న గింజలపై వ్యాన్‌ ఎక్కడంతో అదుపుతప్పి వ్యాన్‌ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌ డ్రైవర్‌కు గానీ, సహాయకుడికి గానీ ఎటువంటి గాయాలు కాలేదు, అలాగే వ్యాన్‌కు ఎటువంటి నష్టం జరగలేదు. అయితే వ్యాన్‌లో రవాణా చేస్తున్న రూ.1.50లక్షలు విలువ చేసే కోడిగుడ్లు రోడ్డుపై పడిపోవడంతో అవన్నీ పూర్తిగా పగిలిపోయాయి. రోడ్డుపై పడిపోయి పగిలిపోయిన కోడిగుడ్లను స్థానికులు ఇంటికి తీసుకు వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement