పార్వతీపురం రూరల్: జంఘావతి ప్రాజెక్టు సాధనే ధ్యేయంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఐక్యంగా పోరాడాలని తీర్మానించాయి. ఈ మేరకు గురువారం పార్వతీపురంలోని గిరిజన సామాజిక భవనంలో ’జంఘావతి ప్రాజెక్టు సాధన సమితి’ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించాలని ఈ సందర్భంగా నేతలు డిమాండ్ చేశారు. పాలకుల నిర్లక్ష్యం వల్లే జంఘావతి ప్రాజెక్టు నేటికీ పూర్తి కాలేదని వారు పేర్కొన్నారు. ప్రాజెక్టు సాధన కోసం రానున్న పది రోజుల్లో వేలాది మందితో పార్వతీపురంలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు సమావేశంలో ప్రకటించారు. ప్రాజెక్టు పూర్తయ్యే వరకు అందరూ ఐక్యంగా ముందుకు సాగుతామని నాయకులు ముక్తకంఠంతో స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సాధన సమితి నేతలు మరిశర్ల మాలతీ కృష్ణమూర్తి నాయుడు, చుక్క భాస్కరరావు, పల్లి రాజగోపాల్ నాయుడులతో పాటు సీపీఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ, ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు గేదెల సర్వేశ్వరరావు, కాంగ్రెస్ అధ్యక్షులు తీళ్ల గౌరీశంకర్ రావు, సీపీఐ నేత ఆర్.వీ.ఎస్ కుమార్, ఇతర ప్రజా సంఘాల నాయకులు ఎం.కృష్ణమూర్తి, బుడితి అప్పలనాయుడు, పోలా రమణి, రెడ్డి శ్రీదేవి, గున్నేష్, బీవీ రమణ, బి.సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.


