పురిటి ఆనందం..అంతలోనే విషాదం..! | - | Sakshi
Sakshi News home page

పురిటి ఆనందం..అంతలోనే విషాదం..!

Oct 8 2026 1:24 AM | Updated on Oct 8 2026 1:24 AM

పురిటి ఆనందం..అంతలోనే విషాదం..!

● వరుసగా ముగ్గురు బాలింతల మృతి

● గిరిజన పల్లెల్లో కలవరం

పాచిపెంట: తొమ్మిది నెలలు కడుపులో మోసి..బిడ్డను ఎప్పుడు చేతుల్లోకి తీసుకుంటానా అని ఎదురుచూశారు. పురిటి నొప్పులను భరించి పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆ చిన్నారి బోసినవ్వులు చూస్తూ మురిసిపోవాల్సిన వేళ..విధి వారి జీవితాలను అర్ధాంతరంగా ముగించింది. అమ్మ ఒడిలో పెరగాల్సిన పసిబిడ్డలకు తల్లి ప్రేమ దూరమైంది. ఒక ఇంట్లో తల్లిని కోల్పోయిన పసికందు మిగిలితే.. మరో ఇంట్లో బిడ్డతోపాటే తల్లి ప్రాణమూ పోయింది. రోజుల వ్యవధిలో పాచిపెంట మండలంలోని గిరిజన గ్రామాలకు చెందిన ముగ్గురు బాలింతలు కన్నుమూయడం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపడంతోపాటు గిరిజన పల్లెల్లో కలవరం రేపుతోంది. పురిటి ఆనందం పూర్తిగా ఆస్వాదించకముందే ఆ కుటుంబాలను విషాదం చుట్టుముట్టడం అందరినీ కలిచివేస్తోంది.

పసిబిడ్డను వదిలి..తల్లి

గొట్టూరు పంచాయతీ మూలపాడుకు చెందిన పోయి రంభ (25) ఈ ఏడాది మార్చి 21న గురువునాయుడుపేట పీహెచ్‌సీలో మగబిడ్డకు జన్మనిచ్చింది. గత 15 రోజులుగా కాళ్లు, చేతులు, ముఖం వాపులు, నొప్పులతో బాధపడుతున్న ఆమె సాలూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందడంతోపాటు నాటు మందులు వాడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పరిస్థితి విషమించి బుధవారం మృతిచెందింది. బిడ్డ క్షేమంగా ఉన్నాడు.

బిడ్డతో పాటు తల్లి కూడా..

కేరంగి పంచాయతీ దొరలద్దండికి చెందిన పాడి సీతమ్మ (41) గత నెల 25న ప్రసవం కోసం గురువునాయుడుపేట పీహెచ్‌సీకి రాగా సాలూరు ఏరియా ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ సిజేరియన్‌ ద్వారా మగబిడ్డకు జన్మనివ్వగా శిశువు మృతి చెందింది. ఆమె పరిస్థితి విషమించడంతో విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సీతమ్మ కూడా మృతి చెందినట్లు వైద్యాధికారి సురేష్‌ చంద్రదేవ్‌ తెలిపారు.

మరో గిరిజన కుటుంబంలోనూ విషాదమే..

పాంచాలి పంచాయతీ జీలుగువలసకు చెందిన కొర్రా లక్ష్మి (28) ఆగస్టు 30న సాలూరు ఏరియా ఆస్పత్రిలో మగబిడ్డకు జ న్మనిచ్చింది. ఈ నెల 3న అనారోగ్యానికి గురై స్థా నికంగా నాటు వైద్యం చేయించుకుని పసరు మందు వాడినట్లు సమాచారం. ఆరోగ్యం క్షీణించడంతో గురువునాయుడుపేట పీహెచ్‌సీ నుంచి సా లూరు, అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

కారణాలపై విచారణ అవసరం

వరుస మరణాలతో గిరిజన పల్లెల్లో ఆందోళన నెలకొంది. ప్రసవానంతరం బాలింతల ఆరోగ్యాన్ని క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తున్నారా? అనారోగ్య లక్షణాలను ముందుగానే గుర్తిస్తున్నారా? నాటు, పసరు మందులపై తగిన అవగాహన కల్పిస్తున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ముగ్గురి మరణాలకు ఒకే కారణమని నిర్ధారణ కాలేదు. నాటు మందులే కారణమని తేల్చడం సరికాదు. వైద్య రికార్డులు, చికిత్స వివరాలను పరిశీలించి మరణాలకు గల కారణాలపై సమగ్ర విచారణ జరపడంతోపాటు గిరిజన గ్రామాల్లో బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement