● భయంతో పరుగు తీసిన షిఫ్ట్ ఆపరేటర్‌లు
వీరఘట్టం/పాలకొండ రూరల్: పాలకొండ మండలం నవగాం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. సబ్‌స్టేషన్‌లో ఉన్న పవర్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మంగళవారం రాత్రి 10.20 గంటలకు నిప్పులు రాలడంతో పెద్దగా మంటలు వ్యాపించాయి. దీంతో భయభ్రాంతులకు గురైన షిఫ్ట్ ఆపరేటర్లు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది యార్డ్‌లో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేసి మంటలను అదుపు చేశారు. ఈ విషయాన్ని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేయడంతో డీఈఈ రామకృష్ణ, ఏడీఈ చంద్రమౌళి, వీరఘట్టం, పాలకొండ ఏఈలు సోమేశ్వరరావు, యోగితో పాటు లైన్‌మెన్ అందరూ నవగాం సబ్‌స్టేషన్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పవర్ ట్రాన్స్‌ఫార్మర్ నుంచి ఆయిల్ లీకవడంతో మంటలు చెలరేగినట్లు గుర్తించారు.పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌కు పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ప్రత్యామ్నాయ విద్యుత్ పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. వీరఘట్టం, పాలకొండల నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా తీసుకుని బుధవారం తెల్లవారుజామున 3.15 గంటలకు నవగాం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఉన్న అన్ని ఫీడర్లకు విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చేశారు. బుధవారం ఉదయం పార్వతీపురం మన్యం జిల్లా విద్యుత్‌శాఖ ఎంఆర్‌టీ టీమ్ వచ్చి పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను పరిశీలించారు. దీన్ని బాగుచేసేందుకు మరో రెండు రోజులు సమయం పట్టే అవకాశం ఉందని ట్రాన్స్‌కో అధికారులు చెబుతున్నారు.


