సీతానగరం: మండలంలోని ప్రధానరహదారిపై హనుమాన్ జంక్షన్ వద్ద ఆటో ద్విచక్రవాహనం ‘ఢీ’కొట్టిన సంఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి గాయాలపాలయ్యాడు. దీనిపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాలూరు నుంచి పార్వతీపురం పేపర్ ప్లేట్ల లోడ్‌తో ఆటో వెళ్తుండగా సీతానగరం మండలంలోని హనుమాన్ జంక్షన్ దాటుతున్న సమయంలో సీతానగరం గ్రామంలోని సుంకరివీధికి చెందిన కర్రోతు మహేష్ హైవేరోడ్డుకు ఎడమ భాగాన ఉన్న హడ్కో కాలనీ రోడ్డు నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి రోడ్డు దాటుకుని వస్తుండగా ఆటో ఢీకొట్టడంతో తలకు గాయాలయ్యాయి. ద్విచక్ర వాహనంపై నుంచి మహేష్ కిందకు పడిపోవడంతో రోడ్డు తగిలి తలకు గాయాలయ్యాయి. గాయాల పాలైన వ్యక్తిని గమనించిన స్థానికులు వెంటనే స్థానిక ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. డాక్టర్ పి.ఉషారాణి ప్రాథమిక వైద్యసేలందించిన అనంతరం మెరుగైన వైద్య సహాయం నిమిత్తం 108 వాహనం సహాయంతో పార్వతీపురం ప్రభుత్వ జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. సీతానగరం పోలీసులు ప్రమాద జరిగిన స్థలాన్ని పరిశీలించారు.


