కొమెర విద్యార్థి ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

కొమెర విద్యార్థి ప్రతిభ

Oct 7 2026 1:28 AM | Updated on Oct 7 2026 1:28 AM

రేగిడి: మండల పరిధిలోని కొమెర గ్రామానికి చెందిన పాడి గాయత్రి చక్కని ప్రతిభ కనబరిచింది. ఈ నెల 5న విడుదలైన అగ్రిసెట్‌లో రాష్ట్రస్థాయిలో 69వ ర్యాంకు సాధించింది. ఆమె తల్లిదండ్రులు పాడి రామమోహన్‌, పాడి కవిత వ్యవసాయ కుటుంబానికి చెందినవారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు గాయత్రిని అభినందించారు.

మెగా జాబ్‌ మేళా రేపు

పార్వతీపురం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలోని మోడల్‌ కెరీర్‌ సెంటర్‌ సౌజన్యంతో అక్టోబర్‌ 8న గురువారం పార్వతీపురం మన్యం జిల్లాలో మెగా జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారి సీహెచ్‌. సుబ్బారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక గాయత్రి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు ఈ మేళా జరుగుతుంది. టాటా ఎలక్ట్రానిక్స్‌, ఫాక్స్‌కాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, కియా మోటార్స్‌, మదర్‌సన్‌, హెటిరోతో సహా మొత్తం 10 సంస్థలు ఈ జాబ్‌ మేళాలో పాల్గొంటున్నాయి. 8, 10వ తరగతి, ఇంటర్‌, ఐటీఐ, డిప్లమో, ఏదైనా డిగ్రీ, బీటెక్‌ (బ్యాక్‌లాగ్స్‌ ఉన్నవారూ అర్హులే), ఎంఎస్సీ చదివిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికై న వారికి కంపెనీని బట్టి నెలకు రూ.9,500 నుంచి రూ.35,800 వరకు వేతనం చెల్లిస్తారు. సంస్థల నిబంధనల ప్రకారం పీఎఫ్‌, ఈఎస్‌ఐతో పాటు ఉచిత భోజనం, వసతి, రవాణా సదుపాయాలు కల్పిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా ఆన్‌న్‌లైన్‌ ఫారం ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని, ఇంటర్వ్యూకు హాజరయ్యేటప్పుడు తప్పనిసరిగా తమ బయోడేటా (రెజ్యూమె), పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలను తీసుకురావాలని అధికారులు సూచించారు.

పిచ్చి కుక్క దాడిలో నలుగురికి గాయాలు

చీపురుపల్లి: పట్టణంలోని దేవాంగులవీధిలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఏకకాలంలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులపై దాడి చేసి స్థానికులను ఆందోళనకు గురి చేసింది. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో దేవాంగులవీధిలో వాకిట్లో నిలబడిన పండిత సంతోష్‌ కుమార్‌, పండిత విష్ణుప్రియ, పండిత కళ్యాణి, పండిత గోవర్ధన్‌లను పిచ్చి కుక్క ఇష్టారాజ్యంగా కరిచి అక్కడి నుంచి పరారైంది. అకస్మాత్తుగా వీధిలోకి వచ్చిన పిచ్చి కుక్క స్థానికులను కరిచి వేస్తుండడంతో స్థానికులు గుర్తించి వెంబడించగా అక్కడి నుంచి సమీపంలోని రైల్వేస్టేషన్‌ వైపు పరుగులు తీసి పరారైంది. దీంతో కుక్క కాటుకు గురైన వారిని స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడ వారికి టీకాలు వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement