ఏజెన్సీ చిన్నారులపై
● మూడు రోజుల్లో ఇద్దరి మృతి
● ఆందోళనలో తల్లిదండ్రులు
సీతంపేట: ఏజెన్సీలో చిన్నారుల వరుస మరణాలు కలవర పెడుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. శనివారం వంబరెల్లికి చెందిన రెండు నెలల పసిబిడ్డ రోజంతా గుక్కతిప్పకుండా ఏడుస్తుండడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు.అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. చిన్నకంబకు చెందిన మరో ఆరునెలల బాలుడు ఉన్నట్టుండి ఇంటివద్ద తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి రిఫర్ చేశారు.అక్కడ నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. వరుసగా సంభవిస్తున్న ఈ ఘటనలు సీతంపేట ఏజెన్సీలో చిన్నారుల ఆరోగ్యపరిస్థితిపై కలకలం రేపుతున్నాయి.
ఏం జరుగుతోంది..?
అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తున్నారు. అయినా చిన్నారులు అనారోగ్యానికి గురై ప్రాణాలు కోల్పోవడానికి పోషకాహారలోపం, రక్తహీనత, తక్కువ బరువు వంటి కారణాలేమైనా ఉన్నాయా? అన్నది పరిశీలించాల్సి ఉంది. ప్రతి చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై క్రమం తప్పకుండా పర్యవేక్షణ జరుగుతోంది. ఎత్తు, బరువులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థ ఏర్పాటు చేశారు. వైద్యశాఖ ద్వారా సకాలంలో టీకాలు వేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నా మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల మృతిచెందిన చిన్నారుల వైద్యచరిత్ర, పోషక స్థితి, రక్తహీనత, బరువు, వ్యాధి తీవ్రత తదితర అంశాలు పరిశీలించాల్సి ఉందని పలువురు తెలియజేస్తున్నారు. ఒక్కో చిన్నారి మృతి వెనుక ఒక్కో కుటుంబం తీరని విషాదంలో మునిగిపోతోంది. కారణం పోషకాహార లోపమా..? వైద్యసేవల కొరతా? లేదా మరేదైనా కారణమా అన్నది శోధించాల్సి ఉందని పలువురు తెలియజేస్తున్నారు. వెలుగులోకి వస్తున్న మరణాలు కొన్నైతే, మారుమూల ప్రాంతాల్లో వెలుగులోకి రానివి ఎన్నో ఉంటాయని పలువురు చెబుతున్నారు. మరో చిన్నారి ప్రాణం పోయే వరకు వేచిచూడకుండా చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు.
పోషకాహారం సక్రమంగా అందిస్తున్నాం
చిన్నారులకు సరైన పోషకాహారం అందిస్తున్నాం. ప్రతి రోజూ అంగన్వాడీ కేంద్రాలు తెరిచి ఉంచి పిల్లలను పర్యవేక్షిస్తున్నాం. ఎత్తు, బరువులు ఎప్పటికప్పుడు చూస్తున్నాం. పిల్లల పర్యవేక్షణలో తల్లిదండ్రులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి.


