● అడుగడుగునా దౌర్జన్యం..
అధికార దుర్వినియోగం
● ఎస్‌ఎంసీ చైర్మన్ అభ్యర్థి సుంకర గణపతి ఆరోపణ
గజపతినగరం రూరల్: తొలిసారి వాయిదా అనంతరం ఈ నెల మూడో తేదీన రెండోసారి నిర్వహించిన మండలంలోని లోగిశ పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్‌ఎంసి) ఎన్నికల్లో అడుగడుగున దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపించిందని, అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకుని టీడీపీ మద్దతుదారులు ఎన్నిక వాయిదా వేయించారని.. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని లోగిశ జెడ్పీ హైస్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్ అభ్యర్థి సుంకరి గణపతి అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము ఆశించినా.. అధికార పార్టీ అండదండలతో టీడీపీ మద్దతు దారులు రెచ్చిపోయి దాడులకు దిగారని ఆరోపించారు. దూర ప్రాంతాల నుంచి తమకు మద్దతు తెలిపే తల్లిదండ్రులను ఆటోలో తీసుకువస్తే ఆ ఆటోలపై దాడి చేసి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు. అలాగే ఓటర్లు కానివారు పాఠశాల లోపలికి ప్రవేశించి గందరగోళం సష్టించి ఘర్షణకు దిగారని, ఇవన్నీ పోలీసుల సమక్షంలోనే జరిగినా ప్రేక్షకపాత్ర వహించారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తమను రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేశారన్నారు. ఎస్సై కిరణ్ కుమార్ నాయుడిని అధికార పార్టీ నాయకులు తమ ఇళ్లల్లోకి, తమ పార్టీ కార్యాలయంలోనికి పంపించి నానా యాగీ చేయించారని..ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. 165 మంది తల్లిదండ్రులు సంతకాలు పెట్టినా ఎందుకు ఎన్నిక నిర్వహించలేదని ప్రశ్నించారు. టీడీపీ మద్దతుదారులకు పూర్తి బలం ఉంటే.. ఎన్నిక వాయిదా పడేది కాదు కదా అన్నారు. ఆ బలం లేకే అధికారాన్ని ఉపయోగించుకుని ప్రధానోపాధ్యాయులు, పోలీసుల సహకారంతో ఎన్నిక వాయిదా వేసే పన్నాగం పన్నారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికనని, దీనికి సంబంధించి తమ వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని.. న్యాయ స్థానంలో తేల్చుకుంటామని స్పష్టం చేశారు.


