పూసపాటిరేగ: త్రిశూల్‌తో యువత చైతన్యవంతులు కావాలని విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పూసపాటిరేగ మండలం సీహెచ్ అగ్రహారంలో గల ఓ ప్రైవేట్ లే అవుట్‌లో విద్యార్థులు, యువతకు మహిళల భద్రత, రహదారి భద్రత, డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు, యువత రహదారి భద్రత, మహిళలు, బాలల భద్రత, మాదక ద్రవ్యాల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఇందులో భాగంగా జిల్లా పోలీస్ శాఖ త్రిశూల్ పేరుతో యువతలో చైతన్యం నింపేందుకుచర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళలు, బాలల భద్రత, రహదారి భద్రత పట్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాలికలు, మహిళల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికలపై లైంగికదాడులకు పాల్పడే నిందితులపై న్యాయస్థానాల్లో నేరాలు రుజువయ్యేలా జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన చర్యల ఫలితంగా 35పోక్సో కేసుల్లో 20 సంవత్సరాలకు పైబడి శిక్షల పడినట్లు తెలిపారు. యువత ఆకతాయిపనులకు స్వస్తి పలికి మహిళలు, బాలికల పట్ల గౌరవ భావంతో మెలగాలని వారికి భద్రత కల్పించడంలో భాగస్వాములు కావాలని యువతకు పిలుపునిచ్చారు. రహదారి భద్రత పాటించకుంటే తప్పు చేయని కుటుంబాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. కుటుంబాన్ని పెంచే యజమాని లేక వారి పిల్లల భవిష్యత్ అంధకారంలోకి వెళ్తుందన్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించేవిధంగా చూడాలని , రహదారి భద్రతా నియమాలు, నిబంధనలు పాటించాలని కోరారు. యువత డ్రగ్స్, గంజాయికి అలవాటు పడితే జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. యువత భవిష్యత్‌ను నాశనం చేసే క్రికెట్ బెట్టింగ్స్, రమ్మీ ఆటలకు దూరంగా ఉండాలన్నారు. ఇటువంటి యాప్స్ ఉపయోగించడం వల్ల అప్పుల బారిన పడే అవకాశాలు ఏర్పడతాయన్నారు. యువత మంచి క్రమశిక్షణ, నడవడికతో చదువులపై దృష్టి సారించి భవిష్యత్‌కు బంగారు బాట వేసుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఎస్పీ ఎస్.రాఘవులు,భోగాపురం రూరల్ సీఐ ఎన్. శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్సై వి. అరుణ్‌కిరణ్‌తో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొన్నారు.


