అంతర్జాతీయ భోగాపురంలో.. అవస్థల జీవనం..! | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ భోగాపురంలో.. అవస్థల జీవనం..!

Oct 6 2026 12:54 AM | Updated on Oct 6 2026 12:54 AM

సాక్షిప్రతినిధి,విజయనగరం/పూసపాటిరేగ:

ఊరికి విమానాశ్రయం వచ్చింది అని ఆనందించాలో ఊరికి చుట్టూ ఉరితాడు పేనిందని బాధపడాలో తెలియని దుస్థితి. తామిచ్చిన భూముల్లో విమానాలు ఎగురుతున్నాయి. మొన్నటివరకు గోగు, వేరుశనగ పండిన పొలాల్లో రాజహంసల్లాంటి విమానాలు వాలుతున్నాయి.. కానీ ఆ పొలాల అవతలున్న తోటలు... చేలలోకి వెళ్లాలంటే భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ, జమ్మయ్యపాలెం గ్రామస్తులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అప్పట్లా అడ్డంగా నడిచిపోయే దారి లేదు. ఎటు చూసినా భారీ జైలు గోడను తలపించే ప్రహరీ. ఆపైన విద్యుత్‌ ఫెన్సింగ్‌. దానిలోంచి వెళ్లే దారి లేదు. చుట్టూ తిరిగి వెళ్దామంటే ఎలా వెళ్లినా ఐదారు కిలోమీటర్లు దూరం. పైగా ఆ దారి కూడా లారీలు.. టిప్పర్ల మట్టి రవాణాతో మోకాళ్ల లోతు గోతులు.. ఎక్కడైనా బండి కానీ సైకిల్‌ కానీ దిగబడితే ఇక అంతే. మరి ఆ భూముల్లోని కొబ్బరి .. మామిడి తోటలు.. ఇతర పొలాల్లోకి ఎలా వెళ్లేది.. ఫలసాయం ఎలా తెచ్చుకునేది అంటూ పలు గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌ కారణంగా మా గ్రామాలకు గుర్తింపు వచ్చిందా ? ఆ ప్రాజెక్టు మా జీవితాలకు గుదిబండగా మారిందా? అన్న ప్రశ్నకు సమాధానం తెలియడం లేదని అంటున్నారు.

● ప్రగల్బాలు వద్దు.. దారిచూపండి..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘స్వర్ణాంధ్ర సాధిస్తాం.. ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేస్తాం’ అంటూ ప్రకటనలకే పరిమితమైంది తప్ప, క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న రాకపోకల తిప్పలను పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని ఉందన్నట్లు‘ ఎయిర్‌పోర్టు పక్కనే ఉన్న పల్లెలకు చిన్న దారి వేసేందుకు ప్రభుత్వం చొరవచూపకపోవడంపై ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విమానాశ్రయ పనుల కోసం పాత రోడ్లను మూసివేసి, ప్రత్యామ్నాయం చూపకపోవడంతో బడులకు వెళ్లే పిల్ల లు, అత్యవసర వైద్యం కోసం వెళ్లే రోగులు నిత్యం అల్లాడిపోతున్నారు.

చుట్టూ తిరుగుతున్నాం..

ఎయిర్‌పోర్ట్‌ వస్తే మా ఊళ్ల రూపురేఖలు మారతాయనుకున్నాం. తీరా చూస్తే ఉన్న రహదారి కూడా పోయి డొంకబాటలే దిక్కయ్యాయి. కూటమి ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళికే లేదు. రోడ్డుకు కిలోమీటరు దూరంలో ఉన్న ఊరికి ఇప్పుడు 5 కిలోమీటర్ల మేర చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. ఆటోలు కూడా మా ఊళ్లకు రావడానికి భయపడుతున్నాయి.

– కెళ్ల సూరిబాబు, దిబ్బలపాలెం

ఇబ్బందులు పడుతున్నాం..

ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లేందుకు ఒక్కటే రోడ్డు వేశారు. సర్వీసు రోడ్లు వేయలేదు. జంక్షన్లలో అండర్‌ పాసేజ్‌లు ఇవ్వలేదు. దీంతో గ్రామం ఓ వైపు.. పంటల భూములు రోడ్డుకు మరోవైపు ఉండిపోయాయి. రోడ్డు దాటి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నాం. పంట ఉత్పత్తులు తెచ్చేకునేందుకు కష్టాలు తప్పడంలేదు. సర్వీసు రోడ్లు నిర్మించి మార్గం సుగమం చేయాలి.

– నీలాపు చిట్టమ్మ, దిబ్బలపాలెం

మా బాధలు పట్టించుకోవడంలేదు..

ప్రభుత్వం, అధికారులు మా రోడ్డు కష్టాలను పట్టించుకోవడం లేదు. చిన్న వర్షం పడితే చాలు తాత్కాలిక మట్టిదారులు బురదమయమై కాలినడకన వెళ్లడం కూడా కష్టమవుతోంది. అత్యవసర పరిస్థితి వస్తే ఊళ్లోనే ప్రాణాలు వదలాల్సి వస్తోంది.

– మునకాల బంగారమ్మ, దిబ్బలపాలెం

● నరకయాతన..

‘ముందు వెళ్తే గొయ్యి.. వెనక్కి వస్తే నుయ్యి!’ అనేలా తయారైంది విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం సరిహద్దు గ్రామాల పరిస్థితి. ఎయిర్‌పోర్టు వస్తే తమ బతుకులు మారుతాయని ఆశపడిన దిబ్బలపాలెం, కవులవాడ, జమ్మయ్యపాలెం ప్రజల కు ఇప్పుడు కనీసం నడవడానికి దారి కూడా లేక నిత్యం నరకయాతన అనుభవించాల్సి వస్తోంది. ‘చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు ‘అధికారు లు, ప్రజాప్రతినిధులు ముందే ప్రత్యామ్నాయ రహదారులు చూపించకుండా నిర్లక్ష్యం వహించడంతో ఈ మూడు గ్రామాల ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.

అభివృద్ధికి నోచుకోని జమ్మయ్యపేట రోడ్డు

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ పేరుతో గ్రామాలు దిగ్బంధం

గ్రామాలకు తెగిన ‘కనెక్టివిటీ’

‘కూటమి’ నిర్లక్ష్యానికి

బలైపోతున్న దిబ్బలపాలెం, కవులవాడ, జమ్మయ్యపాలెం

స్వర్ణాంధ్ర ప్రగల్భాలు సరే.. పల్లెలకు దారేది?

అధికారుల నిర్లక్ష్యంతో

స్తంభించిన రాకపోకలు..

కూటమి సర్కారు తీరుపై గ్రామీణుల మండిపాటు

సర్వీసు రోడ్లు నిర్మించాలని వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement