టెక్కలి: టెక్కలికి చెందిన మార్పు సాయిసృజన పార్వతీపురం మన్యం జిల్లా కోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా శనివారం బాధ్యతలు స్వీకరించారు. టెక్కలికి చెందిన ఉపాధ్యాయుడు నారాయణమూర్తి, ఝాన్సీ దంపతుల చిన్న కుమార్తె సాయిసృజన ఇటీవల జడ్జిగా ఎంపికై న సంగతి తెలిసిందే.
ఆదివాసీలపై వివక్ష తగదు
● అక్టోబర్ 1న కురుపాం నియోజకవర్గ కేంద్రంలో ఆదివాసీల ర్యాలీ
కురుపాం: ఆదివాసీలపై చంద్రబాబు ప్రభుత్వం వివక్ష చూపడం తగదని, తక్షణమే ఆదివాసీలకు వంద శాతం రిజర్వేషన్ కల్పించేలా జీ నంబర్ 3కు ప్రత్యామ్నాయ జీఓ తీసుకురావాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆరిక అశోక్ డిమాండ్ చేశారు. స్థానిక విలేకరులతో శనివారం మాట్లాడుతూ... ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఆదివాసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 1వ తేదీన కురుపాంలో ర్యాలీ నిర్వహిస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో మన్యం జిల్లా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మండంగి శ్రీనువాసరావు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు అనిల్, తదితరులు పాల్గొన్నారు.
నిలకడగా ‘తోటపల్లి’ నీరు
గరుగుబిల్లి: తోటపల్లి బ్యారేజ్ వద్ద నాగావళి నది వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శనివారం ఉదయం నాటికి వరద ప్రవా హం క్రమంగా తగ్గి 15వేల క్యూసెక్కులకు చేరింది. మరలా మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎగువ ప్రాంతం నుంచి బ్యారేజీకి ఒక్కసారిగా 23వేల క్యూసెక్కుల వరద ప్రవాహం చేరింది. దీంతో బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో ఇరిగేషన్ అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం 3 గంటల తరువాత వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతూ సాయంత్రానికి 10 వేల క్యూసెక్కుల స్థాయికి చేరుకొని ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 105 మీటర్లకు 104.20 మీటర్ల నీరు నిల్వ ఉంది. నాగావళి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నది, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఇరిగేషన్ ఏఈ కిశోర్ కుమార్ సూచించారు.
● మెరుగైన వైద్యసేవలందక సీతన్న మృతి చెందారని కుటుంబీకుల ఆరోపణ
మెంటాడ: మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ కొండపర్తి బాడవ గ్రామానికి చెందిన అంజి సీతన్నదొర(76) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయాసం, కాళ్ల పొంగులతో బాధపడుతున్న ఆయనను డోలీలో స్థానిక గిరిజనులు ఆండ్ర రిజర్వాయర్‌కు వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి తెప్పపై జలశయాన్ని దాటించి, 108 వాహనంలో గజపతినగరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో వైద్యులు ఆయనకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం అవసరమైన మందులు ఇచ్చి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. ఈ క్రమంలో ఆస్పత్రి నుంచి బయటకు వచ్చి ఆయన మగతగా ఉందని సమీపంలోని దుకాణం వద్ద ఒక బెంచ్‌పై చేరబడ్డారు. ఊరికి వెళ్లడానికి బస్సులు లేక ఆటోలో కొండపర్తికి వచ్చేసరికి అర్ధరాత్రి ఒంటిగంట దాటింది. ఆ సమయంలో తెప్పలు లేకపోవడంతో ఆటోలోనే నిద్రించారు. శనివారం తెల్లవారుజామున చూసే సరికి విగతజీవిగా మారడంతో మృతుడి భార్య బుచ్చమ్మ కన్నీరుపెట్టారు. వైద్యుల నిర్వాకం వల్లే తన భర్త మరణించారని వాపోయారు. ఆసుపత్రిలోనే ఉంచితే ఆయన బ్రతికి ఉండేవారని కన్నీటిపర్యంతమయ్యారు. అష్టకష్టాలు పడి అనారోగ్యంతో బాధపడతున్న తన తండ్రిని ఆసుపత్రికి తీసుకొస్తే వైద్యులు ఏమీ లేద ని తిరిగి ఇంటికి పంపించేయడం దారుణమని మృతుడి కుమారుడు ఏరయ్య ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజనులపై చిన్నచూపు చూడటంతోనే తండ్రి మరణించారని ఆరోపించారు.


