పార్వతీపురం: శ్రావణ శుక్రవారం, రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురష్కరించుకుని పార్వతీపురం పట్టణంలోని కన్యకాపరమేశ్వరి వీధిలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయంలో యిండుపూరు కుటుంబీకులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు చేశారు. ఈ సందర్భంగా యిండుపూరు గోపాలరావు, అన్నదమ్ములు మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ యిండుపూరు గున్నేశ్వరరావు, శ్రీ వాసవీ ఆర్యవైశ్యసంఘం అధ్యక్షుడుయిండుపూరు గుంపస్వామి తదితర కుటుంబ సభ్యులు అమ్మవారికి బంగారు భుజకీర్తులను సమర్పించారు. అనంతరం ఆ బంగారు ఆభరణాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
రక్షా బంధన్ శుభాకాంక్షలు
జియ్యమ్మవలస రూరల్: మీ అందరి ఆశీస్సులు, ప్రేమాభిమానాలే శ్రీరామ రక్ష కావాలని, నియోజకవర్గంలోని నా సోదరులంతా నాకు తోడుగా ఉండాలని, నా శ్రేయస్సును కోరుకుంటున్న మీ అందరి కుటుంబాల్లో రాఖీ పౌర్ణమి సుఖశాంతులు నింపాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆకాంక్షించారు. చినమేరంగిలోని తన నివాసంలో సోదర సమానులకు రాఖీలుకట్టి శుభాకాంక్షలు తెలిపారు.
సిరిమానోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
● సాధారణ భక్తుల దర్మనాలకు
అంతరాయం లేకుండా చూడాలి
● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి
విజయనగరం గంటస్తంభం: పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ఈ సారి వైభవంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 25, 26 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, 27న సిరిమానోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిరిమానోత్సవం నిర్ణీత సమయానికే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఉదయం 11 గంటలకే సిరిమానును అమ్మవారి ఆలయం వద్దకు చేర్చేలా చూడాలన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణపై ప్రతేక దృష్టి సారించడంతోపాటు ఎల్‌ఈడీ స్క్రీన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. శాఖలన్నీ పరస్పర సమన్వయంతో పనిచేసి ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ, ఈ ఏడాది అమ్మవారి పండుగకు సుమారు 3.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దానికి అనుగుణంగా బారికేడ్లు పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీఆర్వో ఎం.అరుణకూమారి, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శిరీష, సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, ఆలయ కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


