న్యాయవాదుల విధులు బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల విధులు బహిష్కరణ

Aug 28 2026 1:15 AM | Updated on Aug 28 2026 1:15 AM

విజయనగరం లీగల్‌: న్యాయవాదుల రక్షణ చట్టం రూపొందించడంలో జాప్యాన్ని నిరసిస్తూ స్థానిక సంఘ సభ్యులు గురువారం తమ విధులను బహిష్కరించారు. కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నళితం రమేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఈ నిరసన శుక్రవారం కూడా కొనసాగుతుందన్నారు. మన పొరుగు రాష్ట్రాల్లో న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లో ఉందన్నారు. మన ప్రభుత్వం చట్టం రూపొందించడంలో తీవ్ర జాప్యం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సభ్యులు బెల్లాన రవి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దశలవారీగా నిరసన కార్యక్రమం మరింత ఉధృతం చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో న్యా యవాదులపై భౌతిక దాడులు జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. తక్షణమే ఈ చట్టాన్ని రూపొందించి అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, సీనియర్‌, జూనియర్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.

బొమ్మిక సమీపంలో

ఏనుగుల గుంపు

భామిని: మండలంలోని బొమ్మిక సమీపంలో ఏనుగుల గుంపు సంచరిస్తూ స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. పక్కుడుబద్ర మెట్టపై మకాం వేసిన నాలుగు ఏనుగుల గుంపు మెల్లగా తిరుగుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో బొమ్మిక సమీపంలో గురువారం సంచరించడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

దోమతెరల పంపిణీతో సరి!

శృంగవరపుకోట: బొడ్డపాడు గ్రామంలో బుధవారం నాలుగేళ్ల చిన్నారి జ్వరంతో కన్నుమూసిన నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా డీఎంహెచ్‌ఓ జీవనరాణి తమ సిబ్బందితో కలిసి రాయివానిపాలెం, గాదెల్లోవ, బొడ్డపాడు, శెనగపాడు గ్రామాల్లో పర్యటించారు. అక్కడ గ్రామ పెద్దలతో దోమతెరలు పంపిణీ చేయించారు. బొడ్డపాడు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. సంచివైద్యుల వద్దకు వెళ్లొద్దని, సిబ్బంది అందుబాటులో ఉంటారంటూ గిరిజనులకు సూచించారు. మొత్తంగా దోమతెరల పంపిణీతో మమ అనిపించారు.

చిల్లంగి నెపంతో మహిళపై దాడి

సంతకవిటి: మండలంలోని పుల్లిట గ్రామానికి చెందిన పిన్నింటి లక్ష్మికి చిల్లంగి ఉందని అదే గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు దాడి చేసినట్టు ఎస్‌ఐ ఆర్‌.గోపాలరావు తెలిపారు. పుల్లిట గ్రామానికి చెందిన కె.వెంకటరత్నం, పి.పావని, పి.భారతి, కె.గోవింద ఈ నెల 5న లక్ష్మి ఇంటికి వచ్చి నీకు చిల్లంగి ఉంది, నువ్వు కలలోకి వచ్చి రాత్రి కనిపిస్తున్నావు అంటూ ఇంటికి వచ్చి గొడవ చేసి తనపై దాడి చేయడంతో గ్రామ పెద్దల దృష్టిలో పెట్టినా న్యాయం జరగలేదని గురువారం లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

బస్సు ఢీకొని మహిళకు గాయాలు

రాజాం సిటీ: స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళకు గాయాలయ్యాయి. ఎస్‌ఐ మహ్మద్‌ సల్మాన్‌ బేగ్‌ తెలిపిన వివరాలు.. ఈ నెల 24న విశాఖపట్నంలోని కృష్ణానగర్‌కు చెందిన గుల్లాల రాజేశ్వరి ఆమె సోదరి బేబీరాణితో కలసి డ్వాక్రా గ్రూపుల పని నిమిత్తం ఆర్టీసీ బస్సులో రాజాం వచ్చారు. సాయంత్రం 5.30గంటల సమయంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో పాఠశాల బస్సు ఎక్కుతున్న కొంతమంది విద్యార్థులు ఆమెను తోసేశారు. కిందపడిపోయిన ఆమెను అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ గమనించక ఆమె కాలుపై ఎక్కించడంతో కాలు విరిగింది. వెంటనే స్థానికుల సహాయంతో రాజాంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి, అక్కడ నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement