గరుగుబిల్లి: సన్యాసిరాజుపేట గ్రామంలోని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఆలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి శివలింగానికి అలంకరించిన నాగభరణం, వినాయక స్వామి, పార్వతీదేవి అమ్మవారి విగ్రహానికి ఉన్న కిరీటాలు, శతగోపం తదితర వెండి వస్తువులను అపహరించి పరారయ్యారు. చోరీపై కేసు నమోదు చేసి విశాఖపట్నం పీఎం పాలెం పోలీస్‌స్టేషన్ క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది సహకారంతో గత కొద్ది రోజులుగా గాలింపు చేపట్టి నిందితుల వివరాలను సేకరించి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు నుంచి ఆలయంలో చోరీకి గురైన వస్తువుల్లో 90శాతం వరకు వెండి వస్తువులను రికవరీ చేసినట్లు సీఐ టీవీ తిరుపతిరావు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని పార్వతీపురం మెజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం హాజరు పరిచినట్లు ఎస్‌ఐ షేక్ ఫకృద్దీన్ తెలిపారు.


