పార్వతీపురం రూరల్: అభం శుభం తెలియని ఓ దివ్యాంగ బాలికపై ఓ కామాంధుడు మృగంగా మారాడు. మానవత్వాన్ని మంటగలుపుతూ అమానుషానికి పాల్పడిన ఘటన పార్వతీపురం పట్టణంలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని 17 ఏళ్ల దివ్యాంగ బాలిక సోమవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వెళ్తోంది. ఒంటరిగా ఉన్న ఆ బాలికను చూసిన అజయ్‌నగర్‌కు చెందిన వంగపండు నూకరాజు (29) ఆమెను మభ్యపెట్టి జయలక్ష్మి సెల్ పాయింట్ వద్దకు తీసుకెళ్లాడు. చిన్నారి చెవి పోగులు అపహరించడమే కాకుండా, పైశాచికంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు టౌన్ సీఐ బి.వెంకటరావు ఆదేశాలతో ఎస్‌ఐ సింహాచలం వెంటనే స్పందించి పోక్సో, బీఎన్‌ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును వేగ వంతం చేసి ముద్దాయిని మంగళవారం ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాలతో సెప్టెంబర్ 7వ తేదీ వరకు నిందితుడికి జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.
పార్వతీపురం రూరల్: కుటుంబ పోషణ కోసం వయసుతో సంబంధం లేకుండా శ్రమిస్తున్న చిరువ్యాపారిని విషసర్పం బలితీసుకుంది. కొమరాడ మండలం పరశురాంపురానికి చెందిన జమ్మి నారాయణరావు (70) ఇదే మండలంలోని మార్కొండపుట్టి గ్రామంలోని చర్చి సమీపంలో చిన్నపాటి నూడిల్స్ బండిని నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. రోజూ మాదిరిగానే సాయంత్రం 6 గంటల సమయంలో తన వ్యాపారం నిమిత్తం బండి వద్దకు బయలుదేరాడు. మార్గంమధ్యలో చీకట్లో విషసర్పం కాటేసింది. మొదట ఏదో పురుగు కుట్టిందని భావించిన ఆయన.. కాసేపటి తర్వాత పాము కాటుగా గుర్తించాడు. కుటుంబ సభ్యుల సహాయంతో హుటాహుటిన పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి చేరుకున్నాడు. అక్కడి వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ, అప్పటికే విషం శరీరానికి వేగంగా పాకడంతో మృతిచెందాడు. ఇంటి యజమాని మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది.
సాలూరు: ప్రజలకు మేలు జరగాలంటే రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర అన్నారు. తాడేపల్లిలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక విలేకరులతో ఫోన్‌లో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తోందన్నారు. స్థానిక సంస్థల్లో మరోసారి ప్రజలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు సమష్టిగా పనిచేసి స్థానిక సంస్థల్లో పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేయాలని కోరారు.


