పార్వతీపురం: విపత్తు, నిర్వహణ రంగంలో విశేష సేవలు అందించిన వ్యక్తులు, సంస్థలను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘సుభాష్ చంద్రబోష్ ఆపద ప్రబంధన్ పురస్కార్–2027’ అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విపత్తు నివారణ, ముందస్తు సన్నాహాలు, సహాయక చర్యలు, అవగాహన, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలలో ప్రతిభ చూపిన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ రంగాల నుంచి కనీసం ఐదు ఉత్తమ నామినేషన్లు సమర్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హులు నిర్ణీత పోర్టల్ ద్వారా గడువులోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
అధికార లాంఛనాలతో
కానిస్టేబుల్ అంత్యక్రియలు
గుర్ల: మండలంలోని భూపాలపురం గ్రామానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ శీర రమణ ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. పోస్టుమార్టం అనతంరం కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి సోమవారం తీసుకురాగా.. ఏఆర్ అడిషనల్ ఎస్పీ కిరణ్‌కుమార్, డీఎస్పీ రాఘవులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టారు. ఈ సమయంలో పోలీసులు మమూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కేవీ సూర్యనారాయణరాజు, జెడ్పీటీసీ సభ్యుడు శీర అప్పలనాయుడు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, తదితరులు కూడా మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
పోయిన బ్యాగ్ అందజేత
రాజాం సిటీ: ఆర్టీసీ బస్సులో పోగొట్టుకున్న హ్యాండ్‌బ్యాగ్‌ను రాజాం పోలీసులు సోమవారం బాధిత మహిళకు అందజేశారు. సీఐ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులో స్వాతి అనే మహిళ ఆదివారం రాజాం వచ్చారు. ఈక్రమంలో తులంన్నర బంగారం, రూ. 8 వేలు ఉన్న హ్యాండ్ బ్యాగ్‌ను బస్సులో మర్చిపోయి దిగిపోయింది. కొద్దిసేపటికే బ్యాగ్ మరిచిపోయిన విషయం తెలుసుకుని బస్సుకోసం వెతకగా.. అప్పటికే ఆ బస్సు వెళ్లిపోయింది. దీంతో ఆమె స్థానిక పోలీసులను ఆశ్రయించగా.. సీసీ కెమెరాల ద్వారా బస్సును గుర్తించిన పోలీసులు సంబంధిత డ్రైవర్‌ను సంప్రదించారు. సీట్ల మధ్యలో బ్యాగ్ ఉందని గుర్తించిన డ్రైవర్ దాన్ని పోలీసులకు అప్పగించగా.. వారు బాధిత మహిళకు అప్పగించారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
లైసెన్స్ తుపాకులు
డిపాజిట్ చేయాలి
● ఎస్పీ ఏఆర్ దామోదర్
విజయనగరం టౌన్: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీ చేశారు. లైసెన్స్ తుపాకులు కలిగిన వ్యక్తులు తమ ఆయుధాలను సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో డిపాజిట్ చేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పటిష్టమైన ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి, ప్రజలతో మమేకం కావాలని సూచించారు. డిపాజిట్ చేసిన ఆయుధాలను నిబంధనల ప్రకారం జిల్లా కేంద్రంలోని ఆయుధగారానికి తరలించి, సురక్షిత కస్టడీలో ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు.


