● గొర్రెల కాపరి ఎడమ చేయి
తొలగింపు
పూసపాటిరేగ: విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యంతో ఓ గొర్రెల కాపరి తీవ్ర విద్యుత్ ప్రభావానికి గురై ఎడమ చేయిని కోల్పోయిన సంఘటన భోగాపురం మండలంలో చోటుచేసుకుంది. ఎ.రావివలస పంచాయతీ పరిధిలో చిన్నిపేటకు చెందిన సిమ్మి అప్పలస్వామి సుమారు 15 రోజుల కిందట గొర్రెలు కాసేందుకు పొలానికి వెళ్లాడు. ఆ సమయంలో వేలాడుతున్న విద్యుత్ తీగ మేకకు తగలడంతో అది అక్కడికక్కడే మృతి చెందింది. మేకను రక్షించేందుకు వెళ్లిన అప్పలస్వామి విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడ్ని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఎడమ చేతికి తీవ్ర గాయం కావడంతో తొలగించారు. ఇప్పటివరకు తమకు పది లక్షల రూపాయల వరకు ఖర్చయిందని.. మరో పది లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని అప్పలస్వామి కొడుకు రామసూరి ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖాధికారుల నిర్లక్ష్యం కారణంగానే తన తండ్రి చేయిని తొలగించాల్సి వచ్చిందని, అయితే ఇంతవరకు ఏ ఒక్కరూ కనీసం పరామర్శించలేదని చెప్పారు. తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


