● 33 శాతం రిజర్వేషన్‌ను షరతుల్లేకుండా అమలు చేయాలి
విజయనగరం గంటస్తంభం: చట్టసభల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్‌కు జనగణన, డీలిమిటేషన్ వంటి షరతులు లేకుండా తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యా(ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు అత్తిలి విమల డిమాండ్ చేశారు. మహిళల హక్కులు, భద్రత, సమానత్వం కోసం ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు చేపట్టాలని కోరారు. మహిళా సాధికారతకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్మి, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్మి బుగత పావని ఆధ్వర్యంలో శనివారం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. మయూరి జంక్షన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం కాంప్లెక్స్ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా విమల మాట్లాడుతూ, మహిళలు, బాలికలపై జరుగుతున్న హింస, అత్యాచారాలను అరికట్టి రక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలని అన్నారు. మహిళలు, కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న మద్యాన్ని పూర్తిగా నిషేధించి బెల్డ్‌షాపుల సంస్కృతిని అరికట్టాలని డిమాండ్ చేశారు. ఆడ పిల్లలకు డిగ్రీ నుంచి పీజీ వరకు ఉచిత, నాణ్యమైన విద్య, మహిళలకు ఉచిత వైద్యం, పోషకారం, సంపూర్ణ ఆరోగ్య భద్రత కల్పించాలని అన్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పటిష్టంగా అమలు చేసి మహిళా కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో లక్ష్మమ్మ, రమణమ్మ, వెంకటలక్ష్మి, లక్ష్మితో పాటు మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


