పార్వతీపురం రూరల్ : ప్రాణాలు నిలబెట్టే వైద్యశాల ప్రాంగణంలో ఓ రోగి తన ప్రాణాల మీదకు తెచ్చుకునేలా చేసిన అనాలోచిత యత్నం తీవ్ర కలకలం రేపింది. వ్యసనం కాటుకు మానసిక స్థిమితం కోల్పోయిన ఓ వ్యక్తి ఏకంగా ఆస్పత్రి భవనం పైనుంచి కిందకు దూకిన హఠాత్పరిణామం అక్కడి వారిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మద్యానికి బానిసై, మతిస్థిమితం దెబ్బతిన్న కొమరాడ మండలం అర్తాం గ్రామానికి చెందిన బాధితుడు మీనక శంకరరావు(33)ను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స నిమిత్తం శుక్రవారం పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం రాత్రి సమయంలో అతడు తీవ్ర అశాంతికి లోనయ్యాడు. పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు అతనికి ఎంతగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా అతడిలో మార్పు రాలేదు. వారి వారింపులను ఏమాత్రం లెక్కచేయని ఆ బాధితుడు.. ఎవరూ ఊహించని రీతిలో క్షణికావేశంలో హఠాత్తుగా ఆసర్పత్రి భవనం పైకి ఎక్కి అమాంతం కిందకు దూకేశాడు. భవనం పైనుంచి దూకడంతో సదరు వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కళ్లెదుటే జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, తోటి రోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి వర్గాలు, బాధితుడిని హుటాహుటిన అత్యవసర విభాగానికి తరలించి ముమ్మరంగా ప్రాథమిక చికిత్స అందించారు. గాయాలు తీవ్రంగా ఉండటంతో పరిస్థితిని అంచనా వేసిన వైద్యులు, మెరుగైన వైద్య సహాయం కోసం 108 (బేసిక్ లైఫ్ సపోర్ట్) అంబులెన్స్ వాహనంలో రాత్రికి రాత్రే విజయనగరం తరలించగా మార్గంమధ్యలో మృతి చెందాడు.
ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి


