వారపు సంతలకు చెల్లుచీటీ | - | Sakshi
Sakshi News home page

వారపు సంతలకు చెల్లుచీటీ

Aug 21 2026 9:50 AM | Updated on Aug 21 2026 9:50 AM

వారపు సంతలకు చెల్లుచీటీ

రాజాం: వారపు సంత అంటే పండగలా ఉండేది. వారం వచ్చిందంటే చాలు ఆరోజు సంతలో అన్ని రకాల కూరగాయలు, ఇంటి సామగ్రి, తినుబండారాలు, అలంకార వస్తువులు కనిపించేవి. వాటి ధరలు కూడా కారుచౌకగా ఉండేవి. వాటిని అమ్మే విక్రయదారులకు గౌరవ మర్యాదలు కనిపించేవి. వారం మొత్తానికి సరిపడా వస్తువులు ఆ సంతలో కొనుగోలు చేయగా, తక్కువ బడ్జెట్‌లో ఇంటిల్లిపాది జీవనం సాగిపోయేది. అంత ప్రాముఖ్యత ఉండే సంతలు ఇప్పుడు కనుమరుగయ్యాయి. వారపు సంతలను ప్రజలు మరిచిపోయారు. పట్టణాల్లో సూపర్‌ మార్కెట్‌లు, మార్నింగ్‌ మార్కెట్‌లు వచ్చేశాయి. గ్రామాల్లో వాడవాడలా వ్యాపారాలు పెరిగాయి. బళ్లు, ఆటోలతో గ్రామాల్లో వ్యాపారాలు వచ్చేశాయి. ఏ రోజు సరుకు ఆరోజే, తాజా ధరలకు విక్రయాలు చేస్తున్నారు. చిల్లర పనిలేకుండా ఫోన్‌ పేల వినియోగం పెరిగింది. ఫలితంగా వారపు సంతలు అటకెక్కాయి. తక్కువ బడ్జెట్‌లో పోయే జీవితాలు కాస్ట్‌లీ అయ్యాయి. ఏరోజు కూర, నార, అలంకరణ వస్తుసామగ్రి ఆరోజు వినియోగంతో సరిపోతుంది. గత సంతల్లో లభించే వస్తువులకు వినియోగపు గడువు ఉండేది కాదు. ఇప్పుడు లభించే ప్రతి వస్తువుపై నిర్ణీత వినియోగపు గడువు ఉండడంతో పాటు ధరలు ఫిక్స్‌డ్‌ కావడంతో కొసరు వ్యాపారాలు కనుమరుగయ్యాయి.

కారుచౌకగా వస్తుసామగ్రి

సంతలో వస్తుసామగ్రి అప్పటికీ ఇప్పటికీ బయట మార్కెట్‌ కంటే చౌకగానే లభిస్తాయని చెప్పాలి. ఇక్కడకు తీసుకొచ్చే సరుకు వెనక్కి తీసుకెళ్లకుండా మొత్తం అమ్మేపనిలో భాగంగా వ్యాపారులు ధరను డిమాండ్‌ ఆధారంగా తగ్గిస్తూ విక్రయాలు చేస్తారు. ఫలితంగా కూరగాయలు, కిరాణా సామగ్రిలో భాగమైన పప్పులు, ఉప్పుల ధరలు, నిత్యావసర సరుకులైన చింతపండు, ఉల్లి, పోపుల సామాన్ల ధరలు తక్కువగా ఉంటాయి. వాటితో పాటు ఇంటికి, పొలంపనులకు అవసరమయ్యే వస్తుసామగ్రి ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండేవి.

రాజాం నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో జరిగే సంతలు ఎంతో ఫేమస్‌గా ఉండేవి. రాజాంలో ప్రతి గురువారం సంత జరుగుతుంది. ఇప్పటికీ ఈ సంత నిర్వహణ ఉన్నప్పటికీ గతంలో కంటే డిమాండ్‌ తగ్గింది. గడిచిన పదేళ్ల క్రితం వరకూ రాజాంలో పశు వ్యాపారం అంతర్‌జిల్లాలు దాటేది. మేలు జాతి దేశీయ ఆవులు ఇక్కడ అమ్మకాలు చేసేవారు. వాటిని కొనుగోలు చేసేందుకు ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఫామ్‌ హౌస్‌ల యజమానులు, భూ స్వాములు వచ్చేవారు. ఇప్పుడు ఆ దేశీయ జాతులు ఆవుల విక్రయాలు, ఉత్పత్తి తగ్గిపోయింది. ఈ సంతలో విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుంచి కూరగాయలు, ఇతర కిరాణా, నిత్యవసర సరుకులు తీసుకొచ్చి లక్షల్లో వ్యాపారాలు చేసేవారు. ఇవన్నీ చెల్లుచీటీగా మారాయి.

అప్పటికీ..ఇప్పటికీ చాలా తేడా

గతంలో సంతలు అంటే ఓ పెద్ద వ్యాపార మార్కెట్‌గా ఉండేది. విక్రయదారులతో పాటు కొనుగోలుదారుల్లో స్వచ్ఛత ఉండేది. తూకాల్లో లోపాలు ఉండేవి కాదు. సరుకులో కూడా అంతే నాణ్యత ఉండేది. రాజాంలో పాడి పశువులు, కోళ్లు, గొర్రెలు, పందుల క్రయవిక్రయాలతో పాటు ఇంటి సరుకులు, వంటసరుకులు అధికంగా అమ్ముడయ్యేవి. చాలా తక్కువ బడ్జెట్‌లో సరుకులు లభించేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ధరలు మండుతున్నా యి. వ్యాపారాలు అలానే అతలాకుతలంగా ఉంటున్నాయి. సంతలు కాలగర్భంలో కలసిపోతున్నాయి.

గార రంగనాథం,

రాజాం చరిత్ర పుస్తక రచయిత, రాజాం.

ఒక్క రాజాంలో మాత్రం ప్రతి గురువారం నిర్వహణ

మిగిలినచోట ఆగిపోయిన సంతమార్కెట్‌లు

ఒకప్పుడు జనాలతో కళకళలాడిన సంతలు

విలేజ్‌ వ్యాపారాలు పెరగడంతో తగ్గిన సంత వ్యాపారాలు

బంగారం వ్యాపారపు సంత

నియోజకవర్గంలో రేగిడి మండలంలోని ఉంగరాడ గ్రామంలో ప్రతి ఆదివారం వారపు సంత జరిగేది. ఇక్కడ ఎక్కువగా చిరుధాన్యాల వ్యాపారం నిర్వహించేవారు. ఈ సంతలో బంగారం వస్తువుల విక్రయాలు చేసేవారని, వాటిని కొనుగోలుచేసేందుకు వందలాది గ్రామాల ప్రజలు వచ్చేవారని వినికిడి ఉంది. ఈ సంతలో ప్రముఖ పారిశ్రామికవేత్త జీఎంఆర్‌ తండ్రి చినసన్యాశిరాజు బంగారం వ్యాపారంలో పాల్గొనేవారని ఇక్కడివారు చెబుతున్నారు. జ్యూయలరీ షాపులు, గ్రామాల్లో బంగారువర్తకులు వచ్చిన తరువాత సంతలో బంగారు వ్యాపారం పడిపోవడంతో పాటు సంత కూడా కనుమరుగైంది. సంతకవిటి మండలం మందరాడలో ప్రతి శుక్రవారం పెద్ద ఎత్తున సంత జరిగేది. ఇక్కడి సంతలో కూరగాయలు, కిరాణా వ్యాపారంతో పాటు నాటుకోళ్ల విక్రయాలు ఎక్కువగా జరిగేవి. మామిడి సీజన్‌లో వందలాది గ్రామాల మామిడి వ్యాపారులు ఇక్కడ నుంచే ఇతర ప్రాంతాలకు మామిడిసరుకును ఎగుమతిచేసేవారు. మట్టి పాత్రల సంత ఇక్కడే జరిగేది. ఇప్పుడు ఈ సంత పూర్తిగా ఆగిపోయింది.

ఆయా సంతలు

భలే ఫేమస్‌ గురూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement