● ఏడు నెలల్లో పాముకాటుకు గురైన వేలాది మంది
● సకాలంలో బాధితులను ఆస్పత్రికి
తరలిస్తే ప్రాణాపాయం దూరం
● గుర్ల మండలానికి చెందిన ఓ విద్యార్ధిని ఇంటి ముందు కుర్చీలో చదువుకుంటుంగా పాము కాటు వేసింది. ఈ విద్యార్ధిని కూడా ఆస్పత్రిలో చేర్పించేలోగానే మృతి చెందింది.
విజయనగరం ఫోర్ట్: జామి మండలానికి చెందిన జి.ఎర్నాయుడు పొలంలో పనిచేస్తుండగా పాముకాటుకు గురవడంతో కుటుంబసభ్యులు ఎస్. కోట ఏరియా ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
ఇటీవల కాలంలో పాముకాటుకు గురైన వారి సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత వర్షాకాలంలో పాముకాటుకు ఎక్కువగా గురవుతారు. రాత్రి వేళ నీరు కట్టేందుకు వెళ్లే రైతులు, కళ్లానికి వెళ్లే రైతులు, కూరగాయల తోటల్లో ఎక్కువుగా రైతులు పాముకాటుకు గురవుతున్నారు. పొలం పనుల్లో బీజీగా ఉన్న సమయంలో రైతులు విషసర్పాల సంచారాన్ని పెద్దగా పట్టించుకోరు. కొంతమంది అయితే పాములపై కాలు వేయడం, తెలియకుండా చేత్తో పట్టేయడం వల్ల కూడా పాముకాటుకు గురవుతుంటారు. అయితే పాముకాటుకు గురైన వారిని సకాలంలో (గోల్డెన్ హవర్) ఆస్పత్రికి తరలించినట్లయితే ప్రాణాలు కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఏమాత్రం అలసత్వం వహించినా, పసర మందులు లాంటివి వేసి ఆలస్యం చేసినా ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.
అత్యంత అప్రమత్తంగా ఉండాలి
ప్రస్తుత సీజన్‌లో రైతులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆగస్టు నెల నుంచి నవంబర్ నెలాఖరు వరకు జాగ్రత్త వహించాలి. రాత్రి వేళ మరింత జాగ్రత్త అవసరం. రాత్రి వేళ పొలానికి వెళ్లేటప్పుడు టార్చ్ లైట్, చేతి కర్ర పట్టుకుని వెళ్లాలి. రబ్బురు షూ ధరిస్తే మరింత మంచిది . రాత్రి వేళ పొలంలోకి వెళ్లేటప్పుడు కర్రతో చప్పుడు చేసుకుని వెళ్లాలి.
ఏడు నెలల్లో పాము కాటు బారిన వేలాది మంది
ఏడు నెలల వ్యఽవధిలో వేలాది మంది పాముకాటుకు గురయ్యారు. జిల్లాలో 50 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఎస్.కోట, గజపతినగరం, చీపురపల్లి, రాజాంలలో ఏరియా ఆస్పత్రులు బాడంగి, భోగాపురం, నెల్లిమర్ల, బొబ్బిలిలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు(సీహెచ్‌సీలు) ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఉంది. పాముకాటుకు గురైన వారు ఆయా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటారు. ఈ ఆస్పత్రుల్లో జనవరి నుంచి జూలై నెలాఖరు నాటికి సుమారు 1215 మంది పాముకాటుకు గురైన వారు చికిత్స పొందారు. అలాగే సెకండరీ హెల్త్ ఆస్పత్రుల్లో 709 మంది, 232 మంది పీహెచ్‌సీల్లో, సర్వజన ఆస్పత్రిలో 274 మంది చికిత్స తీసుకున్నారు.
అందుబాటులో యాంటీ
స్నేక్ వీనమ్
అన్ని ఆస్పత్రుల్లో యాంటీ స్నేక్ వీనమ్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పాముకాటుకు గురైన వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి తీసుకొస్తే త్వరగా చికిత్స అందించి ప్రాణా పాయం నుంచి తప్పించవచ్చు.
డాక్టర్ ఎస్.జీవనరాణి,
డీఎంహెచ్‌ఓ


