పార్వతీపురం రూరల్: బోధనా సామర్థ్యాలకు మెరుగులు దిద్దుకునే దిశగా, ఉపాధ్యాయుల వృత్తిపరమైన నైపుణ్యాల అభివృద్ధికి విద్యాశాఖ చర్యలు చేపట్టింది. జిల్లాలో క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలను శనివారం నుంచి నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు గురువారం తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు 22వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. జాతీయ విద్యా విధానం–2020లో భాగంగా, ప్రతి ఉపాధ్యాయుడు ఏటా 50 గంటల నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న లక్ష్యంతో నెలకు రెండు శనివారాలు ఈ పూర్తిస్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. సబ్జెక్టు పరిజ్ఞానం, పాఠ్య ప్రణాళికలు, మూల్యాంకన విధానాలు, బోధనా పరికరాల తయారీపై ఇందులో మేధోమథనం జరగనుంది. ఆగస్టు నెలకు సంబంధించి 22న జరిగే సమావేశాలకు 50 శాతం ఎస్జీటీలు, నాన్–లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్లు హాజరుకావాలి. క్లస్టర్ సమావేశాల రోజున పాఠశాలలు మూసివేయకూడదని, విద్యావిషయకం అంశాలకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు స్పష్టం చేశారు. సన్మానాలు, వ్యక్తిగత వేడుకలకు ఏమాత్రం తావులేదని, బోధనా మెరుగుదలే ధ్యేయంగా తరగతులు జరగాలని, నిబంధనల ఉల్లంఘనపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిగిలిన 50 శాతం ఉపాధ్యాయులు, లాంగ్వేజ్ సబ్జెక్టుల వారు 29న హాజరుకావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
రేపటి నుంచే క్లస్టర్ సమావేశాలు


